Hardik Pandya On MS Dhoni : భారత టీ20 లీగ్ గత సీజన్ టైటిల్‌ను గుజరాత్‌కు అందించిన హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నాడు. ఆసియా కప్‌లోనూ పాక్‌పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తన ఎదుగుదల వెనుక టీమ్‌ఇండియా మాజీ సారథి, దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ పెద్ద పాత్ర ఉందని తాజాగా వెల్లడించాడు. ఓ క్రీడా ఛానెల్‌తో హార్దిక్ మాట్లాడుతూ.. నేను జీవితం, స్పోర్ట్స్ నేర్చుకునే పరిణామంలో ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా ధోనీని పరిశీలిస్తూ ఉండేవాడిని. అలాగే చాలా విషయాలను అతడి నుంచి నేర్చుకున్నా అని తెలిపాడు.
"ధోనీ మైండ్‌సెట్, నాలెడ్జ్‌ను తరచూ గమనిస్తూ ఉండేవాడిని. అందుకేనేమో నా వ్యక్తిత్వంలోనూ అవి ప్రతిబింబిస్తుంటాయి. బాధ్యతలను తీసుకునేందుకు ఎప్పుడూ ముందుంటా. నా తప్పులు.. అవకాశాలు ఏవైనా సరే సొంతం చేసుకుంటా. కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురవుతుంటాయి. వాటి నుంచి నేర్చుకుంటూ ఉంటా. ఇలానే మహీ భాయ్ నుంచి కూడా చాలా విషయాలను తెలుసుకున్నా. జట్టులో నా పాత్ర ఏంటనేది వైఫల్యాల వల్లే తెలుసుకోగలిగా. గత నాలుగేళ్ల కాలం నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది. ఇప్పటికీ నేను నేర్చుకునే దశలోనే ఉన్నా"
-హార్దిక్ పాండ్య, టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్
మంచి ఫినిషర్ కావాల్సిందే: లోయర్ ఆర్డర్ నుంచి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చే ఆటగాడు ఉండాలని హార్దిక్ పేర్కొన్నాడు. 'మీరు ఓ రెస్టరెంట్‌కు వెళ్లారు. ఆహారం చాలా బాగుంది. కానీ, చివర్లో ఫినిషింగ్ టచ్ మంచిగా లేకపోతే వెలితిగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఆరగించిన భోజనం రుచి కూడా సరిగ్గా అనిపించదు. అలానే మ్యాచ్ విషయంలోనూ ఇలానే ఉంటుంది. ఫలితానికి ఎంత దగ్గరగా వచ్చామనేది విషయమే కాదు. చివర్లో మ్యాచ్‌ను ముగించగలిగే ఫినిషర్ ఉండాల్సిందే. లేకపోతే పరిపూర్ణంగా మ్యాచ్ ముగిసినట్లు కాదు' అని తెలిపాడు. మంచి ఫామ్‌లో ఉన్న హార్దిక్ పాండ్య ఇదే ఊపును వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇవీ చదవండి : 'అలాంటి కీలక ఆటగాడిని బయట ఎలా కూర్చోబెడతారు?'