ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో హార్దిక్ పాండ్యతో ఎందుకు బౌలింగ్ చేయించలేదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. జట్టుకు అవసరమైనప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాడని విమర్శించాడు. అతడి పనిభారాన్ని ఎలా పర్యవేక్షిస్తున్నారో తెలియదన్నాడు. 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసినా అలసిపోతారు కదా అని అడిగాడు. మూడో వన్డేకు ముందు వీరూ విమర్శల వర్షం కురిపించాడు.
"వన్డే సిరీస్ తర్వాత ఉన్నది ఐపీఎల్ మాత్రమే. అంటే హార్దిక్ పాండ్యపై పనిభారం పర్యవేక్షణ కోసం సిరీస్ ఓడిపోయినా ఫర్వాలేదని మీరంటున్నారు. అతడి పనిభారంలో కనీసం 4-5 ఓవర్లు లేకపోతే అది తప్పే. అతడి చేత ఒక్క ఓవర్ కూడా వేయించకూడదా? 50 ఓవర్ల ఫీల్డింగూ అలసటకు కారణమవుతుంది. అందుకే 4-5 ఓవర్లు వేస్తే అతడిపై పనిభారమేమీ పెరగదు. హార్దిక్ పనిభారం పెరుగుతోందని ఎవరు నిర్ణయిస్తారో నాకైతే తెలియదు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత పునరాగమనం చేసి అతడు ఎక్కువ క్రికెటేమీ ఆడలేదు. టెస్టులకు విశ్రాంతినిచ్చారు. 5 టీ20లు ఆడి 2-3 ఓవర్లే వేశాడు. అంటే అతడు ఎక్కువ శ్రమించలేదు. బహుశా ఐపీఎల్ ముందు గాయపడకుండా జాగ్రత్త పడేందుకు వన్డేల్లో బౌలింగ్ చేయనని పాండ్యనే అడిగేందుకు ఆస్కారమైతే ఉంది."
- వీరేంద్ర సెహ్వాగ్, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
రెండో వన్డేలో టీమ్‌ఇండియా నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సునాయాసంగా ఛేదించింది. పేసర్లు భువనేశ్వర్, ప్రసిద్ధ్ కృష్ణను మినహాయిస్తే మిగతా అందరి బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చితకబాదారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, క్రునాల్ పాండ్య బౌలింగ్‌ను ఊచకోత కోశారు. దాంతో జట్టుకు ఆరో బౌలర్ అవసరం ఏర్పడింది. మ్యాచ్ ఓడిపోతున్నా సరే హార్దిక్‌కు విరాట్ బంతినివ్వలేదు. నైపుణ్యాల దృష్ట్యా మున్ముందు అతడు జట్టుకు అత్యంత కీలమని, అతడిపై పనిభారాన్ని పర్యవేక్షిస్తున్నామని ఆ తర్వాత కోహ్లీ వివరించాడు.
ఇదీ చూడండి: ఇండియాXఇంగ్లాండ్: నిర్ణయాత్మక వన్డేలో గెలిచేదెవరు?