నిరంతరాయంగా కొనసాగిన ఇండియన్ సూపర్ లీగ్ ఇతర క్రీడలను ఆరంభించేందుకు స్ఫూర్తిగా నిలిచిందని బీసీసీఐ అధ్యక్షుడు, ఏటీకే మోహన్ బగాన్ సహ యజమాని సౌరవ్ గంగూలీ అన్నారు. సవాళ్లు ఎదురైనా ఐఎస్‌ఎల్‌ను అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. భారత క్రీడా పరిశ్రమలో ఇది సరికొత్త గీటురాయిని నెలకొల్పిందని వెల్లడించారు.
"సవాళ్లు విసిరే సమయంలోనూ సుదీర్ఘ కాలం కొనసాగే క్రీడలను విజయవంతంగా నిర్వహించగలదని భారత్ నిరూపించింది. దేశంలో మరెన్నో క్రీడల్ని పూర్తి స్థాయిలో ఆరంభించేందుకు ఐఎస్‌ఎల్ ప్రేరణగా నిలిచింది. లీగ్ నిర్వహణ భారత క్రీడా పరిశ్రమలోనే సరికొత్త గీటురాయిని నెలకొల్పింది. నిర్వాహకులు ఘన కార్యాన్ని నెత్తిన పెట్టుకున్నారు. గత 6 నెలల కాలాన్ని పరిశీలిస్తే ఇదో గొప్ప విజయమనే చెప్పి తీరాలి."
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
గోవాలో నిర్వహించిన ఐఎస్‌ఎల్‌లో ముంబయి విజేతగా ఆవిర్భవించింది. ఏటీకే మోహన్ బగాన్ రన్నరప్‌గా నిలిచింది. గతేడాది నవంబర్ 20న ఆరంభమైన ఏడో సీజన్ మార్చి 14న ముగిసింది. 11 జట్లు 115 మ్యాచుల్లో తలపడగా 298 గోల్స్ నమోదయ్యాయి. సీజన్‌ను నిరంతరాయంగా కొనసాగించేందుకు నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం గోవాలో 1600 మందితో 14 హోటళ్లలో 18 బయో బుడగలను సృష్టించారు. 70వేల ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. బుడగల కోసమే ఏకంగా రూ.17 కోట్లు ఖర్చుపెట్టారు. మైదానాలను కొత్తగా అభివృద్ధి చేశారు.
"మహమ్మారి సమయంలో మన జీవితాల్లోకి ఫుట్‌బాల్‌ను తీసుకొచ్చేందుకు ఎంతో ధైర్యం, అంకితభావం, ప్రణాళిక అవసరం అయ్యాయి" అని ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మూడో టీ20: సిరీస్‌పై పట్టు సాధించేదెవరు?