Ben stokes retires: స్టోక్స్ వన్డే కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఏది అంటే.. 2019 ప్రపంచకప్ ఫైనల్లోదే. దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ.. జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచిందంటే అందుకు కారణం ఈ ఆల్‌రౌండరే. తుదిపోరులో కివీస్‌పై 84 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు మళ్లించాడు. సూపర్ ఓవర్లో 3 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఆ ఒక్క మ్యాచ్ అనే కాదు ఆ టోర్నీలో అతను నిలకడగా రాణించాడు. 11 మ్యాచ్‌ల్లో 66.42 సగటుతో 465 పరుగులు చేశాడు. ఏడు వికెట్లూ తీశాడు. 11 ఏళ్ల పాటుగా వన్డేల్లో బ్యాటర్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా జట్టుకు అన్ని రకాలుగా ఉపయోగపడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలోనైనా క్రీజులో అడుగుపెట్టి.. ధనాధన్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కీలక సమయాల్లో వికెట్లూ పడగొట్టాడు. గతేడాది టీమ్‌ఇండియాపై 99, 2019 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 89, అదే ఏడాది పాకిస్థాన్‌పై 71 నాటౌట్, 2017లో ఆస్ట్రేలియాపై 102 ఇలా తన వన్డే కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చాలానే ఉన్నాయి. గతేడాది స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ వన్డేల్లో 3-0తో పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఓటమిని ఒప్పుకోని వ్యక్తిత్వం, దూకుడైన ఆటతీరుతో అభిమానుల్లో ప్రత్యేక ఆదరణ సొంతం చేసుకున్న అతను ఇప్పుడు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.
ఇప్పుడే ఎందుకు?: 31 ఏళ్ల స్టోక్స్ మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. పరుగులు చేస్తున్నాడు.. వికెట్లూ తీస్తున్నాడు. టీమ్‌ఇండియాతో చివరి వన్డేలో ముందుకు డైవ్ చేస్తూ హార్దిక్ పాండ్య క్యాచ్‌ను అతను పట్టిన తీరు తన ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. ఇంకా చాలా కాలం మూడు ఫార్మాట్లలో కొనసాగేలా కనిపించిన అతను ఉన్నట్లుండి 50 ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతను టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. తన సారథ్యంలో జట్టు ప్రపంచ ఛాంపియన్ న్యూజిలాండ్‌ను 3-0తో చిత్తు చేసింది. టీమ్‌ఇండియాతో అయిదో టెస్టులో నెగ్గింది. ఈ నేపథ్యంలో ఆ ఫార్మాట్లో జట్టును మరిన్ని విజయాల దిశగా నడిపించడం కోసం వన్డేలను వదిలేసుకున్నాడేమో అనిపిస్తోంది. ఇక తీరిక లేని అంతర్జాతీయ క్రికెట్ తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడం వల్ల గతేడాది అతను కొంత కాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో అతనిప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.
2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ వరకు 71 వన్డేల్లో అతను 50 సగటుతో 2400 పరుగులు చేశాడు. 50 వికెట్లూ పడగొట్టాడు. కానీ పనిభారం కారణంగా ఆ తర్వాత తొమ్మిది వన్డేలు మాత్రమే ఆడాడు. మరోవైపు 2023 నుంచి 2027 వరకు ఇంగ్లాండ్ 42 టెస్టులు, 44 వన్డేలు, 52 టీ20లు ఆడనుంది. ఇవి కాకుండా రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలూ ఉన్నాయి. ఈ తీరిక లేని షెడ్యూల్ కూడా స్టోక్స్ నిర్ణయానికి ఓ కారణమై ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్ తరపున వన్డేల్లో 2,500కు పైగా పరుగులు చేసి, 50కి పైగా వికెట్లు తీసిన మూడో ఆల్‌రౌండర్ స్టోక్స్. కాలింగ్‌వుడ్ (5092, 111), ఫ్లింటాఫ్ (3293, 168) అతనికంటే ముందున్నారు.
ఇవీ చదవండి: ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై
మళ్లీ తెరపైకి హెచ్‌సీఏ రగడ.. అజహరుద్దీన్‌కు బుద్ధి చెప్తామంటున్న మాజీ బేరర్లు