Bazzball Dravid: బజ్‌బాల్.. ఇటీవల ఇంగ్లాండ్ దూకుడైన ఆటతీరును సూచిస్తూ ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. ఈ నేపథ్యంలో బజ్‌బాల్ గురించి టీమ్ఇండియా కోచ్ ద్రవిడ్‌ను ప్రశ్నించగా.. అదేమిటో తనకు తెలీదని బదులిచ్చాడు. 'బజ్‌బాల్ అంటే తెలియదు. గత నాలుగు టెస్టుల్లో ఇంగ్లాండ్ ఆడిన తీరు, నాలుగో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఛేదన లాంటివి ఈ దేశంలో తరచుగా కనిపించవని మాత్రం చెప్తా. కానీ మన ఆటతీరు అనేది ఆటగాళ్లపై, వాళ్ల ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లుంటే సానుకూల దృక్పథంతో క్రికెట్ ఆడి ఆటను ముందుకు తీసుకెళ్లొచ్చు' అని అతను చెప్పాడు.
ఆ పేరు ఎందుకు వచ్చిందంటే.. ప్రస్తుతం ఇంగ్లాండ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఉన్నాడు. అతని ముద్దుపేరు బజ్. పరుగులు చేయడానికి ప్రతి బంతి ఓ అవకాశమే, కేవలం మనుగడ కోసం క్రీజులో ఉండిపోకూడదనేది అతని సిద్ధాంతం. కివీస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతను జట్టుకూ అదే నూరిపోశాడు. ఇక ఐపీఎల్‌లో కేకేఆర్ కోచ్‌గానూ అతను జట్టును అదే పంథాలో నడిపిస్తున్నాడు.
ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే తన లాంటి మనస్తత్వమే ఉన్న స్టోక్స్ కెప్టెన్‌గా ఉండడమూ మెక్‌కలమ్‌కు కలిసొచ్చింది. భారత్‌తో సిరీస్‌లో ఎదురుదెబ్బ, యాషెస్‌లో పరాజయంతో ఢీలా పడ్డ జట్టులో తన సిద్ధాంతంతో ధైర్యం నింపాడు. భయం లేకుండా ఆడడం అలవాటు చేశాడు. అందుకే ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటతీరు గురించి అందరూ బజ్‌బాల్ అని మాట్లాడుతున్నారు.
ఇవీ చదవండి: IND vs WI: ధావన్ కెప్టెన్సీలో విండీస్‌తో వన్డే సిరీస్.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌లో పంత్