శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకపై ఏడాది నిషేధం విధించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఇంగ్లాండ్ పర్యటనలో బయోబబుల్ అతిక్రమణ కారణంగా ఇప్పటికే భారీ జరిమానా విధించిన బోర్డు.. వారిని అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. అలాగే దేశవాళీ పోటీల్లోనూ వారు ఆరు నెలల పాటు ఆడకూడదని స్పష్టం చేసింది.
ఏం జరిగింది!
ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 టోర్నీలో 3-0తో ఓడిపోయింది లంక జట్టు. కరోనా కారణంగా ఆటగాళ్లు ఏ పర్యటనలో అయినా బయోబుడగలో ఉండాల్సిందే. కానీ లంక క్రికెటర్లు ఇద్దరు మాత్రం బయట తిరుగుతూ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇంగ్లాండ్‌లోని ఓ మార్కెట్లో లంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్(Kusal Mendis), వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా(Niroshan Dickwella) తిరుగుతూ కనిపించారు. ఈ ఫొటోలు, వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారు మాస్క్ కూడా పెట్టుకోకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన నెటిజన్లు బయోబబుల్‌లో ఉండాల్సిన ఆటగాళ్లు బయటకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో ఆ దేశ బోర్డు విచారణకు ఆదేశించింది. చివరికి వారిని సస్పెండ్ చేసింది.