ఒలింపిక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులకు పండగే. కానీ ఇందులో ఆ క్రీడ లేకపోవడం క్రికెట్ అభిమానులను కలచివేస్తోంది. మరి అలాంటి మెగా ఈవెంట్లో క్రికెట్‌ను కూడా చేరిస్తే ఇక ఒలింపిక్స్‌కే సరికొత్త ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో 2028 లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు కృషి చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). మరి ''అంత పెద్ద మెగా ఈవెంట్లో క్రికెట్‌ను ఎందుకు చేర్చాలి?'' అన్న ప్రశ్నకు భారత ఉపఖండంలోని అభిమానులను కారణంగా చూపిస్తోంది ఐసీసీ.
క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలంటూ ఓ డాక్యుమెంటరీని ఐసీసీ రూపొందించినట్టు తెలుస్తోంది. భారత్‌లో.. 2019 ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ వీక్షణల సంఖ్యను 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్ వీక్షణల సంఖ్యతో పోల్చింది ఐసీసీ. క్రికెట్ వరల్డ్‌కప్ 54.5 కోట్ల మందిని ఆకర్షించగా.. ఒలింపిక్స్ 19.1 కోట్ల మంది మాత్రమే చూశారని పేర్కొంది. ఇక ఒలింపిక్స్‌ను వీక్షించే వారి సగటు వయసు 53 కాగా.. క్రికెట్‌ను వీక్షించే చూసే వారి సగటు వయసు 34 ఏళ్లని తెలిపింది. 2019 ప్రపంచకప్‌లో 18-32 ఏళ్ల మధ్య వయస్కులే 32శాతం మంది ఉన్నారని వివరించింది. 87శాతం మంది క్రికెట్ అభిమానులు.. క్రీడను ఒలింపిక్స్‌లో చూడాలని ఆశిస్తున్నట్టు పేర్కొంది.
క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడం ద్వారా అదనంగా ఆదాయం చేకూరడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. క్రికెట్లో మొత్తం 104సభ్య దేశాలు ఉండగా.. వాటిలో 92 అసోసియేట్ దేశాలు, మిగిలినవి శాశ్వత సభ్య దేశాలు. క్రికెట్ కనుక లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో భాగమైతే.. అసోసియేషన్ దేశాలకు ఆర్థికంగా కొంత మద్దతు దొరుకుతుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలని సచిన్ వంటి దిగ్గజాలు ఇప్పటికే అభిప్రాయపడ్డారు.
అయితే క్రికెట్‌ను లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో అదనపు క్రీడ కోటా కింద చేర్చాలి. 2020 టోక్యో ఒలింపిక్స్‌తో పాటు 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో అదనపు క్రీడ కోటలో ఖాళీలు లేనందున క్రికెట్‌ను చేర్చడానికి అవకాశం లేకుండా పోయింది.
గతంలో ఇలా..
గతంలో కౌలాలంపూర్ వేదికగా జరిగిన 1998 కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చారు. ఇందులో భారత జట్టులో సచిన్ తెందుల్కర్‌తో పాటు అనిల్ కుంబ్లే, లక్ష్మణ్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇక 2022 బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు అవకాశం కల్పించారు.
ఏకైక సారి.. 121 క్రితం ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఆడాయి. ఇందులో ఇంగ్లాండ్ బంగారు పతకం కైవసం చేసుకోగా.. ఫ్రాన్స్ వెండి పతకాన్ని దక్కించుకుంది.
ఇదీ చదవండి: రిటైర్మెంట్ వార్తలపై టేలర్ క్లారిటీ