టీ 20 క్రికెట్ ప్రభావంతో ప్రస్తుతం థ్రిల్లింగ్ మ్యాచ్‌లకు కొదువలేదు. కానీ 43 ఏళ్ల క్రితం మొదటి ప్రపంచకప్‌లో పాకిస్థాన్ - వెస్టిండీస్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ రేకిత్తించింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించింది. 203 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా... డిరిక్ ముర్రే, ఆండీ రాబర్ట్స్ రికార్డు భాగస్వామ్యంతో(64) మ్యాచ్ గెలిపించారు.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 60 ఓవర్లలో 266 పరుగులు చేసింది. పాక్ కెప్టెన్ మాజిద్ ఖాన్(60), ముస్తాక్ మహ్మద్(55), వసీమ్ రజా(58) అర్ధశతకాలతో అదరగొట్టి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించారు.
267 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ 99కే ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ లాయడ్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. కన్హాయ్ కాసేపు ఆకట్టుకున్నా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. డిరిక్ ముర్రే ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 203 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది కరీబియన్ జట్టు. ఆండీ రాబర్ట్స్‌తో కలిసి డిరిక్ ముర్రే అద్భుతమే చేశాడు. చివరి వికెట్‌కు 64 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో ముర్రే 61 పరుగులతో ఆకట్టుకోగా... ఆండీ రాబర్ట్స్ 24 పరుగులతో నిలకడగా ఆడాడు. పాకిస్థాన్ బౌలర్ సర్ఫరాజ్ నవాజ్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో గెలిచి తొలి ప్రపంచకప్‌ను ముద్దాడింది విండీస్.