45 రోజులు క్రికెట్ ప్రేక్షకులను అలరించిన ప్రపంచకప్ తుది ఘట్టానికి చేరుకుంది. అంచనాలు నిలబెట్టుకుంటూ విధ్వంసకర బ్యాటింగ్‌తో తుదిసమరానికి చేరిన ఇంగ్లాండ్,
పోరాట స్ఫూర్తిని కనబరిచి ఫైనల్ చేరిన న్యూజిలాండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా చరిత్రాత్మకమే. దశాబ్దాలుగా క్రికెట్ ప్రపంచకప్‌ను ముద్దాడాలని కలలుకంటున్న ఇరు జట్లు ఫైనల్లో గెలిచి నవశకానికి నాంది పలకాలని భావిస్తున్నాయి. వీటి మధ్య ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
44 ఏళ్ల వన్డే క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, శ్రీలంక.. ఈ ఐదు జట్లే ఇప్పటివరకు ఛాంపియన్లుగా నిలిచాయి. పెద్ద టోర్నీల్లో తేలిపోయే దక్షిణాఫ్రికాను మినహాయిస్తే మిగతా వాటిలో విశ్వవిజేతగా నిలిచే సత్తా ఉన్న జట్లు ఇంగ్లాండ్, న్యూజిలాండే. కానీ ఇన్నాళ్లూ ఈ రెండు జట్ల పోరాటం సెమీస్‌లోనో, ఫైనల్లోనో ముగిసింది. ఇప్పటికి ఈ రెండు జట్ల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. తొలిసారి వరల్డ్‌కప్ గెలవాలని పట్టుదలగా ఉన్న ఇరు జట్లు తుదిపోరులో సర్వశక్తులు ఒడ్డుతాయనడంలో సందేహం లేదు.
ఇంగ్లాండ్‌కు బ్యాటింగే బలం
భారీ లక్ష్యాలను సైతం ఛేదించే సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్లతో ఇంగ్లాండ్ బలంగా కనిపిస్తోంది. రాయ్, రూట్, బట్లర్, బెయిర్ స్టో, స్టోక్స్ బ్యాట్‌తోనూ.. క్రిస్ వోక్స్, ఆర్చర్, ప్లంకెట్ బంతితో రాణిస్తున్నారు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మోర్గాన్ సేన.. ఒక దశలో సెమీస్ చేరడం కష్టంగా కనిపించింది. ఆరంభ విజయాల్లో కీలక పాత్ర పోషించిన రాయ్ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరం కాగానే ఇంగ్లాండ్ గాడి తప్పింది. అతడు కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చి బ్రిటీష్ జట్టును సెమీస్‌కు చేర్చాడు. సెమీఫైనల్లో ఆసీస్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన రాయ్ ఆ జట్టును పోటీలోనే లేకుండా చేశాడు.
కివీస్‌కు బౌలింగే బలం
ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్‌ది స్థిరమైన ప్రదర్శన. మొత్తం 8 సార్లు సెమీస్‌కు రావడమే కివీస్ ప్రదర్శనకు నిదర్శనం. వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరిన కివీస్ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని వ్యూహాలు రచిస్తోంది. గత ప్రపంచకప్‌లో ఆసీస్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ ఈసారి విలియమ్సన్ నేతృత్వంలో టైటిల్ గెలవాలని భావిస్తోంది.
ఓపెనర్లు వరుసగా విఫలమవుతున్నా మిడిలార్డర్‌లో కేన్ విలియమ్సన్ పోరాటం, బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు తుది సమరానికి సిద్ధమైంది. బ్యాటింగ్ భారాన్నంతా విలియమ్సన్ మోస్తుండగా.. టేలర్, నీషమ్ కొంత వరకూ సహకారం అందిస్తున్నారు. బౌల్ట్, హెన్రీ, సాంట్నర్, ఫెర్గ్యూసన్ వంటి మేటి బౌలర్లతో ఆ జట్టు బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోంది.
ఇవీ చూడండి.. ఇంగ్లాండ్ ప్రేక్షకులకు పండగే.. ఒకేరోజు మూడు ఫైనల్స్