ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా- భారత్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగాడు. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు అతడు బలిదాన్ గుర్తుతోనే మ్యాచ్‌కు దిగుతాడా లేదా అని ఉత్కంఠగా ఎదురుచూశారు. కాని ఐసీసీ నియమాలను గౌరవిస్తూ ధోనీ బలిదాన్ చిహ్నం లేని గ్లౌజులను వినియోగించాడు.
ఐసీసీ ఆదేశం:
ధోనీ బలిదాన్ గుర్తు ఉన్న గ్లౌజులు ధరించేందుకు అనుమతించాలని బీసీసీఐ రాసిన లేఖని ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టంచేసింది. అందుకు కారణం వివరిస్తూ.. ఆటగాళ్లు ధరించే దుస్తులపై లేదా పరికరాలపై స్పాన్సర్ల స్టిక్కర్లు తప్ప మిగతా సందేశాలు, లోగోలు ఉండరాదని తెలిపింది. కాగా వికెట్‌కీపర్ గ్లోవ్స్ విషయంలోని ప్రామాణికాల ప్రకారం కూడా బలిదాన్ చిహ్నం సరైంది కాదని ఐసీసీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ బోర్డు సూచనలను గౌరవించిన ధోనీ బలిదాన్ చిహ్నం లేని గ్లౌజులనే ఆసీస్ మ్యాచ్‌లో వినియోగించాడు.
సొంత నిర్ణయమన్న ఆర్మీ
అంతకుముందు గ్లౌజులపై బలిదాన్ చిహ్నం వాడకంపై ప్రముఖులు, అభిమానులు, మాజీ క్రికెటర్లు స్పందించారు. కొందరు ధోనీ సూపర్ అంటే మరికొందరు ఆటపై దృష్టిపెట్టాలని కోరారు. చివరకి ఈ విషయంపై భారత సైనిక అధికారులూ మాట్లాడారు. ధోనీ గ్లౌజుల వివాదంపై భారత సైన్యం చెయ్యాల్సిందేమీ లేదని, అది అతడి సొంత నిర్ణయానికే వదిలేస్తున్నామని లెఫ్టినెంట్ జనరల్ చెరిశ్ మాథ్‌సన్ సూచించారు. అంతేకాకుండా మహి గ్లౌజులపై ఉన్న చిహ్నం పారామిలిటరీ రెజిమెంటల్ గుర్తు కాదని పేర్కొంది. అయితే ధోనీ మాత్రం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడని తెలిపింది.
ఇవీ చూడండి: