మెగాటోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన కివీస్Xఇంగ్లాండ్ ఫైనల్లో బౌండరీలతో విజయం సాధించింది ఇంగ్లీష్ జట్టు. ఈ విధంగా ఫలితం నిర్ణయించడం చాలా మందిని నిరుత్సాహపరిచింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఓ బెట్టింగ్ నిర్వాహక సంస్థ... కివీస్ గెలుస్తుందని పందెం కాసిన వారికి డబ్బుల్ని తిరిగి ఇచ్చేందుకు అంగీకరించింది. బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించడం పట్ల ఆ బెట్టింగ్ కంపెనీ అసహనం వ్యక్తం చేసింది.
" టెక్నికల్‌గా న్యూజిలాండ్ ఓడిపోలేదు. అలాంటప్పుడు కివీస్ అభిమానుల నుంచి బెట్టింగ్ డబ్బులు తీసుకోవడం సరికాదు" అని ఆ సంస్థ ప్రతినిధులు అన్నారు.
న్యూజిలాండ్ గెలుస్తుందని బెట్టింగ్ కాసిన సుమారు 11 వేల 458 మందికి చెందిన రూ. 29 కోట్లను(4.26 లక్షల డాలర్లు) రీఫండ్ చేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.
వింబుల్డన్‌కూ వర్తింపు...
రోజర్ ఫెదరర్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ మధ్య వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ దాదాపు 5 గంటల పాటు జరిగింది. ఎప్పటికప్పుడు ఆధిక్యం చేతులు మారుతూ అనుక్షణం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో... చివరకు జకోవిచ్ విజయం సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లోనూ ఐదు సెట్ల పోరాటంలో మూడు సెట్లను టైబ్రేక్‌లే తేల్చాయి. ఫెదరర్ ఏకంగా 25 ఏస్‌లు సంధించినప్పటికీ టైబ్రేక్‌లో వెనుకబడటం వల్ల రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లోనూ ఫెదరర్ ఓ రకంగా ఓటమి పాలైన ఛాంపియన్‌గా పేర్కొంటూ అతడిపై కాసిన పందెం డబ్బులు వాపస్ ఇచ్చేసింది బెట్టింగ్ నిర్వాహక సంస్థ.