ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల విధానం సరైనది కాదని అన్నాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్. ఈ పద్ధతిలో మార్పులు చేయాలని సూచించాడు.
"టెస్టు ఛాంపియన్‌షిప్‌లోని పాయింట్ల విధానం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లకు ఒకేలా పాయింట్లు కేటాయించడం ఎంతవరకు సబబు. తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే ఫైనల్‌కు వెళ్తాయి. మిగిలిన వారికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు వెనకున్న జట్ల మధ్య టెస్టు జరుగుతుంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏముంటుంది" -మైకేల్ హోల్డింగ్, విండీస్ మాజీ క్రికెటర్
ప్రతి రెండేళ్లకొకసారి జరిగే టెస్టు ఛాంపియన్‌షిప్‌లోని ప్రతి సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించారు. సిరీస్‌లో రెండు మ్యాచ్‌లుంటే చెరో టెస్టుకు 60 పాయింట్లు, ఐదుంటే చెరో టెస్టుకు 24 పాయింట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీ ఫైనల్.. 2021 జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనుంది.