కోహ్లీతో తనను పోలుస్తున్నందుకు విసిగెత్తి పోయానని పాకిస్థాన్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు. పాక్‌లో ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లుండగా తనను భారత క్రికెటర్లతో పోల్చడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో జట్టుతో ఉన్న ఈ క్రికెటర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించాడు.
"వాళ్లకంటే (భారత క్రికెటర్లు) పాక్ దిగ్గజ ఆటగాళ్లు జావెద్ మియాందాద్, మహ్మద్ యూసఫ్ లేదా యూనిస్ ఖాన్‌తో పోల్చినా సంతోషపడే వాడ్ని. కోహ్లీ లేదా ఇతర భారత ఆటగాళ్లతో నన్ను ఎందుకు పోలుస్తున్నారు".
- బాబర్ అజామ్, పాకిస్థాన్ కెప్టెన్
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో 70 సెంచరీలను తన పేరు మీద లిఖించుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ పరిమిత ఓవర్ల ఫార్మట్లలో 50కి పైగా సగటుతో 16 శతకాలు చేశాడు. 26 టెస్టుల్లో 45.12 సగటుతో 1,850 పరుగులు సాధించాడు.
వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో తాను ఏ బౌలర్‌ను టార్గెట్ చేయడం లేదని బాబర్ అజామ్ స్పష్టం చేశాడు. కొంతమంది అనుభవుజ్ఞులైన క్రికెటర్లు ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమైనా.. ప్రస్తుతం ఉన్న బౌలర్లు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలరని ఆశిస్తున్నానని తెలిపాడు.