"ఎస్జీ బంతి సీమ్ ఎక్కువ సేపు ఉండట్లేదు.. ఇలాంటి బంతులతో టెస్టుల్లో బౌలింగ్ చేయడం కష్టం. 60 ఓవర్లన్నా వేయకముందే కుట్లు చీలిపోయి సీమ్ మృదువుగా మారుతోంది".. ఇవీ ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు అనంతరం ఎస్జీ బంతుల నాణ్యతపై టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లి, స్పిన్నర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు. వీటి కంటే కూకబురా, డ్యూక్ బంతులతో ఆడడమే నయమని గతంలో అశ్విన్ అన్నాడు. అసలు బంతుల్లో ఈ రకాలు ఏమిటీ? వాటిల్లో ఏం తేడాలున్నాయో చూద్దామా..!
ఎస్జీ బంతులు..
- భారత్‌లో తయారయ్యే ఈ బంతులను కేవలం మన దేశంలో జరిగే మ్యాచ్‌ల్లో మాత్రమే ఉపయోగిస్తారు.
- బంతిపై సీమ్ కోసం ఆరు వరుసల కుట్లు వేస్తారు. ఆ కుట్లను పూర్తిగా చేత్తోనే వేస్తారు.
- చేత్తోనే కుట్లు వేయడంతో ఉబ్బెత్తుగా కనిపించే ఈ బంతి సీమ్ 90 ఓవర్ల వరకూ ఉంటుందని చెప్తారు. ఆరంభంలో ఈ బంతి ఎక్కువగా స్వింగ్ అవదు. ఓ వైపు మెరుపు తేవడం కోసం బంతిని బాగా రుద్దితే అప్పుడు కాస్త స్వింగ్ అవుతుంది. స్పిన్నర్లకు బంతిపై మంచి పట్టు దొరుకుతుంది. సీమ్ పిచ్‌పై తగలడంతో అధిక స్పిన్, బౌన్స్ లభిస్తుంది. పాతబడ్డ బంతి రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
- అయితే ఇటీవల కాలంలో త్వరగానే కుట్లు చీలిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
కూకబురా బంతులు..
- ఆస్ట్రేలియాలో రూపొందించే ఈ బంతులను ఆ దేశంతో పాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వేలో వాడతారు.
- సీమ్ ఆరు వరుసల కుట్లతో ఉంటుంది. అందులో మధ్యలోని రెండు కుట్లను చేత్తో కుడతారు. మిగిలిన నాలుగు కుట్లను యంత్రంతో వేస్తారు.
- బంతిపై నాలుగు కుట్లను యంత్రంతో వేయడంతో దీనిపై ఉబ్బు ఉండదు. సీమ్ కూడా త్వరగా పోతుంది. కానీ బంతి వేగం ఎక్కువగా ఉంటుంది. సుమారు 20 ఓవర్ల తర్వాత ఈ బంతి ప్రభావం తగ్గిపోతుంది. వేలి స్పిన్నర్ల కంటే మణికట్లు స్పిన్నర్లకు దీంతో ఎక్కువ రాణించగలరు.
- డ్యూక్ బంతితో పోలిస్తే దీని స్వింగ్ కూడా తక్కువే.
డ్యూక్ బంతులు..
- ఇంగ్లాండ్‌లో తయారుచేసే ఈ బంతులను ఆ దేశంతో పాటు వెస్టిండీస్, ఐర్లాండ్‌లో ఉపయోగిస్తారు.
- ఆరు వరుసల కుట్లను చేత్తోనే వేస్తారు.
- దారాన్ని చేత్తో కుట్టడంతో బంతి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. దీని సీమ్ ఎక్కువ సేపు ఉండి.. త్వరగా బంతి ఆకారం దెబ్బతినకుండా, గరుకుదనం పోకుండా చూస్తుంది.
- మిగిలిన రెండు రకాల బంతుల కంటే ఎక్కువగా స్వింగ్ అవుతుంది.
ఇదీ చదవండి: తొలిటెస్టులో భారత్ ఓటమి.. క్యూరేటర్ తొలగింపు!