టీమిండియా.. గతేడాది సుదీర్ఘ ఫార్మాట్ రారాజుగా నిలిచింది. భారత క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అత్యధిక పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే టెస్టు మ్యాచ్‌ల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా నెలకొల్పిన 400 పరుగుల రికార్డే గుర్తుకువస్తుంది. అతడి ఘనతను ఎవరు బ్రేక్ చేస్తారనేది చిక్కుప్రశ్నే. అయితే తాజాగా ఈ విషయంపై లారా సమాధానమిచ్చాడు.
" టెస్టుల్లో నేను నెలకొల్పిన 400 పరుగుల రికార్డును చెరిపేయగల సత్తా ప్రస్తుత క్రికెట్లో ముగ్గురికే ఉంది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ మైలురాయిని అధిగమించగలరు. ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ బాగా ఆడినా.. నాలుగో స్థానంలో మైదానంలోకి రావడం వల్ల అతడికి ఈ రికార్డు కాస్త కష్టమే"
-- బ్రియాన్ లారా, వెస్టిండీస్ క్రికెటర్
టెస్టుల్లో ఇప్పటికీ 400 వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డు లారా పేరిటే ఉంది. ఇంగ్లాండ్‌పై అతడు ఈ ఘనత సాధించాడు. దాదాపు 15 ఏళ్లయినా ఏ క్రికెటర్.. ఈ మైలురాయిని అందుకోలేకపోయారు.
కోహ్లీ వాహ్వా
టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు లారా. ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీల్లో విరాట్ సారథ్యంలోని భారత్... విజేతగా నిలవగలదని కొనియాడాడు. కోహ్లీ నేతృత్వంలో టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ అత్యున్నత స్థాయికి వెళ్తోందని అన్నాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో తలపడే అన్ని జట్లకు భారత్ ఓ కీలక ప్రత్యర్థని చెప్పుకొచ్చాడు.
2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను తొలిసారి గెలిచింది ధోనీ సారథ్యంలోని భారత్. ఆ తర్వాత ఈ టోర్నీలో ఒక్కసారైనా మెన్ఇన్బ్లూ గెలవలేకపోయింది. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీసేన... రానున్న టీ20 ప్రపంచకప్‌పై ఆశలుకల్పిస్తోంది.