రానున్న టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టును చూసి చాలా జట్లు భయపడతాయని తెలిపాడు ఇంగ్లాండ్ సహాయ కోచ్ పాల్ కాలింగ్ వుడ్. ఈ సారి తమ టీమ్ చాలా బాగా సన్నద్ధమైందని వెల్లడించాడు.
2010లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకు కాలింగ్ వుడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మరో 7 నెలల్లో భారత్ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనుందని గుర్తు చేశాడు.
"ఈ వరల్డ్‌కప్‌ను తీసుకుంటే.. మా టీమ్‌ను చూసి చాలా జట్లు భయపడతాయి. నాలుగేళ్లుగా వైట్ బాల్ క్రికెట్లో మా జట్టుకున్న ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ విషయాన్ని చెబుతున్నా. టీమ్‌లోని 11 మందిలో చాలా మందికి జట్టును గెలిపించే సత్తా ఉంది. 2010తో పోలిస్తే ప్రస్తుత టీమ్‌కు చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పటి ఇంగ్లాండ్ జట్టే బాగుంది."
-పాల్ కాలింగ్ వుడ్, ఇంగ్లాండ్ సహాయ కోచ్.
పరిమిత ఓవర్ల క్రికెట్లో తమ జట్టు ఆధిపత్యం చెలాయించడం గురించి స్పందించాడు కాలింగ్ వుడ్. "నాలుగేళ్లుగా సాధిస్తున్న విజయాలే ఇందుకు తార్కాణమని పేర్కొన్నాడు. పెద్ద మ్యాచ్‌లలో గెలిచినప్పుడే టీమ్‌గా సత్తా తెలుస్తుంది. ఒత్తిడిలో మ్యాచ్‌లు ఆడటం ప్రపంచకప్‌కు ముందు చాలా అవసరం. శనివారం భారత్‌తో జరిగే మ్యాచ్ మాకు ఫైనల్ లాంటిది" అని కాలింగ్ వుడ్ తెలిపాడు.
చివరి టీ20కి తయారు చేసిన వికెట్ రెండో మ్యాచ్ పిచ్ లాగే ఉందని సహాయ కోచ్ పేర్కొన్నాడు. కొంచెం పేస్ కలిగి ఉందని వెల్లడించాడు. సాఫ్ట్ సిగ్నల్ వివాదంపై స్పందించిన పాల్ కాలింగ్ వుడ్.. అంపైరింగ్ మధ్యలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: ఏమయ్యా అంపైర్.. ఇదెలా ఔట్?