ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో పిచ్ విసిరిన సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైనట్లు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. కొన్ని షాట్ల విషయంలో పొరపాట్లు చేసినట్లు తెలిపాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఉత్తమంగా రాణించిన శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించాడు. క్రీజును ఎలా ఉపయోగించుకోవాలో శ్రేయస్ చూపించాడని చెప్పాడు.
"ఆ పిచ్‌పై ఏం చేయాలో మాకు తెలియలేదు. కొన్ని షాట్లు సరిగా ఆడలేకపోయాం. ఆ సమస్యను మేం పరిష్కరించుకోవాలి. వైఫల్యాలను ఒప్పుకొని, మరింత ఏకాగ్రతతో తిరిగిరావాలి. మేం అనుకున్నట్లుగా షాట్లు ఆడేందుకు వికెట్ సహకరించలేదు. వికెట్ అనుకూలిస్తే తొలి బంతి నుంచి దూకుడుగా ఆడొచ్చు. పిచ్‌ను అంచనా వేయడానికి మేం సమయం తీసుకోలేదు. శ్రేయస్ ఆ పని చేశాడు. బౌన్స్‌ను, పిచ్‌ను ఎలా ఉపయోగించుకోవాలో చూపించాడు. కానీ వికెట్లు కోల్పోవడం వల్ల 150-160 పరుగులు చేయలేకపోయాం."
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా సారథి
మరోవైపు, విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. బౌలింగ్‌లో.. వికెట్ తమకు ఊహించిన దానికంటే ఎక్కువగా అనుకూలించిందని చెప్పాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత్ తరపున శ్రేయస్ అయ్యర్ అర్ధశతకంతో మెరిశాడు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. భారత్‌కు తప్పని ఓటమి