ఆస్ట్రేలియా గడ్డపై టీమ్‌ఇండియా వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలుపొందడం ఎవరూ ఊహించి ఉండరని హెడ్‌కోచ్ రవిశాస్త్రి అన్నాడు. 2018-19 సీజన్‌లో ఆసీస్ ప్రధాన బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ లేనప్పుడు టీమ్‌ఇండియా విజయం సాధించిందని అక్కడి మీడియాతో పాటు పలువురు విమర్శించారని శాస్త్రి గుర్తు చేశాడు.
"మీ జీవితకాలంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితుల్ని చూసే అవకాశం దక్కదు. ఆస్ట్రేలియాను సొంత గడ్డపై వరుసగా రెండుసార్లు ఓడించడం ఎంతో ప్రత్యేకం. ఇంతకుముందు మేం విజయం సాధించినప్పుడు స్మిత్, వార్నర్ లేకుండా గెలిచామని చాలా మంది అన్నారు. ఇప్పుడు వాళ్ల బ్యాండ్ బజాయించి వచ్చాం. ఈ సిరీస్‌లో మా ఆటగాళ్లు ప్రదర్శించిన నిబద్ధత చాలా కాలం గుర్తుండిపోతుంది" అని శాస్త్రి వివరించాడు.
"క్రికెట్‌లో ఇంతకుముందెప్పుడూ ఇలా జరిగి ఉండదు. 36 పరుగులకే ఆలౌటయ్యాక అనూహ్య రీతిలో టీమ్‌ఇండియా పుంజుకుంది. ఇది నమ్మశక్యం కానిది. చివరి టెస్టులో ఇక ఆడకుండా ఉన్నది ఒకే ఒక్క ఆటగాడు. అది కూడా కార్తీక్ త్యాగి. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఎవరైనా కంకషన్‌కు గురైతే అతడు కూడా మైదానంలో అడుగుపెట్టేవాడు. దీని గురించి ఆలోచిస్తేనే రోమాలు నిక్కబొడ్చుకుంటాయి" అని టీమ్‌ఇండియా కోచ్ అభిప్రాయపడ్డాడు. కాగా, కీలక ఆటగాళ్లు లేకున్నా టీమ్‌ఇండియా బలమైన ఆస్ట్రేలియా జట్టును గతనెలలో ఓడించి గబ్బాలో చరిత్ర సృష్టించింది.
ఇదీ చూడండి : 'భారత ఆటగాళ్లూ మనుషులే.. విశ్రాంతి ఇవ్వాలి'