టీ20 క్రికెట్‌లో టీమ్‌ఇండియా-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్‌లో మొత్తం 9వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. సోమవారం దుబాయ్ వేదికగా దిల్లీతో జరిగిన పోరులో బెంగళూరు ఓటమిపాలైనా కోహ్లీ 43 పరుగులతో రాణించాడు. 9వేల పరుగుల మైలురాయిని దాటాడు.
అన్ని రకాల టీ20ల్లో 9 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో ఈ జాబితాలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అందరికంటే ముందున్నాడు. గేల్ ఇప్పటివరకు 404 మ్యాచ్‌లు ఆడగా 13 వేల 296 పరుగులు చేశాడు. తర్వాత అదే విండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ 10 వేల 370 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 9 వేల 926 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. తర్వాత వరుసగా బ్రెండన్ మెక్‌కల్లమ్, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ ఉన్నారు.
చాలా రోజులుగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న విరాట్ దిల్లీతో మ్యాచ్ కన్నా ముందు రాజస్థాన్‌తో తలపడిన టీ20లోనే తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 72 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత సీజన్‌లో బెంగళూరు 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి 6 పాయింట్లతో కొనసాగుతోంది.
అంతర్జాతీయ టీ20ల విషయానికి వస్తే అత్యధిక పరుగులు చేసిన రికార్డు కోహ్లీ పేరుమీదే ఉంది. 2 వేల 794 పరుగులతో కోహ్లీ అందరికంటే ముందంజలో ఉన్నాడు. అతడి తర్వాత రోహిత్ శర్మ 2 వేల 773 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ టీమ్‌ఇండియా తరఫున పొట్టి క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విరాట్ కోహ్లీ ప్రస్తుతం 5 వేల 524 పరుగులతో అందరికన్నా ముందున్నాడు. చెన్నై బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా 5 వేల 368 పరుగులతో రెండో స్థానంలో నిలవగా, ముంబయి సారథి రోహిత్‌శర్మ ఇటీవలే 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడతడు 5వేల 74 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.