క్రికెట్లో బౌన్సర్లను నిషేధించాలంటూ వస్తోన్న వాదనలు సరైనవి కాదని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ చాపెల్. ఈ మార్పు చేస్తే ఆటలో వినోదం ఉండదని, ప్రేక్షకులకు బోర్ కొడుతుందని చెప్పాడు. సమస్యలు కూడా తలెత్తుతాయని వెల్లడించాడు.
"షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే విషయమై టెయిలెండర్లకు రక్షణ కల్పించేలా బౌన్సర్‌కు సంబంధించిన చట్టాన్ని మరింత బలోపేతం చేయాలి. అంతేకానీ బౌన్సర్లను నిషేధించాలనడం సరైనది కాదు. 80వ కాలంలో వెస్టిండీస్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించేవారు. అప్పటినుంచే వీటిని నిషేధించాలంటూ వాదనలు వస్తోన్నాయి. అయినా ఇవేమీ విండీస్ దూకుడుతనాన్ని తగ్గించలేదు. ఏదేమైనప్పటికీ బౌన్సర్లను నిషేధిస్తే మాత్రం ప్రేక్షకులకు, కామెంటరీ చేసేవాళ్లకు బోర్ కొడుతుంది. ఆటలో ఉత్సాహం ఉండదు. పలు సమస్యలు కూడా రావొచ్చు.
-ఇయాన్ చాపెల్, ఆస్ట్రేలియా మాజీ సారథి.
క్రికెట్లో ఈ మధ్య తరచూ బంతి బ్యాట్స్‌మెన్ హెల్మెట్లకు తగులుతోంది. బౌన్సర్లను ఆడలేక వాళ్లు కిందామీదా పడుతున్నారు. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న సిరీస్‌లోనూ బౌన్సర్లు ఇద్దరి తలకు తగలడం వల్ల వారు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. తొలి టీ20లో మిచెల్ స్టార్క్ వేసిన బౌన్సర్ టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా హెల్మెట్‌కు బలంగా తగిలింది. దీంతో అతను ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు రాలేదు. తర్వాతి రెండు టీ20లకు కూడా దూరమయ్యాడు. ఆ తర్వాత ప్రాక్టీస్ మ్యాచులో ఆస్ట్రేలియా ఓపెనర్ విల్ పకోస్కీ కూడా ఇలాగే కార్తీక్ త్యాగి వేసిన బౌన్సర్ తగిలి మైదానాన్ని వీడాడు. ఈ నేపథ్యంలో బౌన్సర్లను నిషేధించాలన్న వాదనలు మళ్లీ తెరపైకి రావడం వల్ల పైవ్యాఖ్యలు చేశాడు చాపెల్.
ఇదీ చూడండి : ఆస్ట్రేలియా క్రికెట్లో విషాదానికి ఐదేళ్లు