భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత్‌లో అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. ఇతడి బ్రాండ్ విలువ ఏడాదికి 1,690 కోట్లు కావడం విశేషం. ఈ ఆటగాడు ఫిట్నెస్ పరంగానూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తినే తిండి నుంచి తాగే నీటి వరకు ఎంతో శ్రద్ధ చూపిస్తాడు విరాట్. ముఖ్యంగా ఇతడు తాగడానికి వాడే నీటి విలువ చూస్తే షాకైపోతారు.
ఇవియన్ వాటర్.. ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ కోహ్లీ తాగే నీళ్లు అంటే మాత్రం గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తాగునీటి బ్రాండ్ ఇది. లీటర్ నీటి సీసా విలువ దాదాపు రూ.600. దీనికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది. దీంతో పాటు డిమాండు కూడా అదే స్థాయిలో ఉంది. సరస్సు నుంచి నీటిని తీసి ఎగుమతి చేయడం చాలా ఖర్చుతో కూడిన పని. అంతేకాకుండా ఈ నీటిని నిల్వ చేయడానికి అత్యంత నాణ్యమైన పాలీఇథలీన్ టెరిఫ్తలేట్ సీసాలను ఉపయోగిస్తారు. ఈ సీసాలను తయారు చేయాలంటే ఎన్నో ముందస్తు పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఈ కారణంగానే ఇవియన్ నీళ్లు అంతవిలువైనవి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఏడాదికి ఎంత ఖర్చు?
లీటర్కు 600 రూపాయలు అనుకుంటే. రోజుకు ఓ క్రీడాకారుడిగా కోహ్లీ కనీసం రెండు లీటర్ల నీటిని తాగుతాడు. అంటే ఏడాదికి (600x2x365) 4,38,000 ఖర్చు చేస్తున్నాడు. మరి ఫిట్నెస్ పరంగా జాగ్రత్తగా ఉండాలంటే ఆమాత్రం ఖర్చు పెట్టడం సరైనదే అంటున్నారు అభిమానులు.
ఏంటి ఇవియన్ కథ
తొలుత ఈ నీటిని ఔషధాల తయారీకి ఉపయోగించేవారు.అయితే దీని వెనక కూడా ఓ కథ ఉంది. 1789లో మార్కిస్ అనే వ్యక్తి ద్వారా ఈ నీటి ప్రాముఖ్యం ప్రపంచానికి తెలిసిందని చెప్తుంటారు. ఆయనకు కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధులుండేవి. అయితే ఆయన జెనీవా సరస్సు మార్గం ద్వారా ఉద్యోగానికి వెళ్లేవారు. దారిలో ఆ సరస్సులో నీరు తాగడం అలవాటుగా మార్చుకున్నాడు. దీంతో ఆయన వ్యాధులు నయమయ్యాయి. జెనీవా నీటి వల్లే తనకు వ్యాధులు నయమయ్యాయని ఆయన ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెప్పడం వల్ల ఆ సరస్సును ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇవియన్ ప్రాంతంలో ఈ సరస్సు ఉంది కాబట్టి ఈ నీళ్లకు కూడా ఇదే పేరు వచ్చింది. తర్వాత ఆ నీటితో ఔషధాలు తయారు చేయడం మొదలు పెట్టింది. దాదాపు 120 ఏళ్లకు పైగా ఈ నీటిని కేవలం ఔషధాల తయారీకి మాత్రమే ఉపయోగించే వారు. 1908లో ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నీటిని సీసాల్లో ఉంచి విక్రయించడం ప్రారంభించింది. ఇక టెక్నాలజీతో పాటు వీటి విక్రయాల్లోనూ మార్పులొచ్చాయి. ఈ నీటికి మరింత డిమాండ్ వస్తుండటంతో 1969లో ప్లాస్టిక్ సీసాల్లో విక్రయించడం ప్రారంభించింది.
ఇవియన్‌లో పోషకాల విలువ ఇలా: లీటర్ ఇవియన్ నీళ్లలో 8మి.గ్రా కాల్షియం, 6.8మి.గ్రా క్లోరైడ్, 26మి.గ్రా మెగ్నీషియం, పొటాషియం 1మి.గ్రా, సోడియం 6.5మి.గ్రా ఉంటాయి.