ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులపై పైచేయి సాధించే బ్యాట్స్‌మన్‌ను ఎంచుకోమంటే దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్‌ను ఎంచుకుంటానని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ అన్నాడు. సోమవారం వార్న్.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. అతడు ఆడిన సమయంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ గురించి మాట్లాడాడు.
''ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్తాచాటే బ్యాట్స్‌మన్‌ను ఎంచుకోవాలంటే.. సచిన్, లారాలో ఎవరిని ఎంపిక చేయాలని కాస్త తడబడతా. అయితే నేను సచిన్‌నే ఎంచుకుంటా. అదే టెస్టు ఆఖరి రోజు 400 పరుగులు చేయాల్సి వస్తే లారాను తీసుకుంటా. ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు'' అని వార్న్ అన్నాడు.
ఆసీస్ మాజీ సారథి స్టీవ్ వా గురించి వార్న్ మాట్లాడాడు. స్టీవ్‌ను మ్యాచ్ విజేత అని అనడం కంటే మ్యాచ్‌ను కాపాడేవాడిగా పేర్కొనాలని అభిప్రాయపడ్డాడు. అయితే అతడు అలెన్ బోర్డర్ సారథిగా ఎంపిక చేసిన ఆస్ట్రేలియన్ టెస్టు ఎలెవన్ జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ లేకపోవడానికి కారణం తెలిపాడు. అతడు కలిసి ఆడిన ఆటగాళ్లను మాత్రమే ఎంచుకున్నానని, అందుకే వార్నర్‌ను ఎంపిక చేయలేదని తెలిపాడు. ఆసీస్ గొప్ప ఓపెనర్లలో వార్నర్ ఒకరని కొనియాడాడు. వార్న్ టెస్టుల్లో 708, వన్డేల్లో 293 వికెట్లు తీశాడు.