మహిళల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడుతుంటే చూసేందుకు దాదాపు వేల మంది మైదానానికి వస్తారని ఎప్పుడైనా ఊహించారా? దేశంలోని కోట్లాది మంది అభిమానులు తమ జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ టీవీల ముందు అతుక్కుపోతారని అనుకున్నారా? కానీ అవన్నీ నిజమయ్యాయి. కాదు కాదు.. భారత అమ్మాయిలు దాన్ని నిజం చేశారు. కొన్నేళ్లుగా నిలకడైన ఆటతీరుతో ప్రపంచ మహిళల క్రికెట్లో బలమైన శక్తిగా ఎదుగుతోన్న టీమిండియా.. దేశంలో అమ్మాయిల క్రికెట్‌కు సరికొత్త ఊపిరులూదింది. దేశంలోని ప్రతి ఒక్క క్రీడాభిమాని తమ గురించి మాట్లాడుకునేలా చేసింది. టీ20 ప్రపంచకప్‌ను గెలవలేకపోయినా.. దేశంలో ఆటను గెలిపించింది. రేపటితరం అమ్మాయిలకు నమ్మకాన్ని కలిగించింది.
భారత మహిళల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడుతుందా? ఏమో తెలీదే.. కొన్నేళ్ల ముందు వరకూ ఎవరిని అడిగినా ఇదే సమాధానం వచ్చేది. జట్టులో ఎవరున్నారు? మన జట్టు ప్రదర్శన ఎలా ఉంది అని పట్టించుకున్నవారే లేరు. ఎంతసేపు సచిన్, ధోనీ, కోహ్లీల ముచ్చట్లే. ఇప్పుడు.. షెఫాలీ ఆట చూస్తుంటే సెహ్వాగ్ గుర్తుకువస్తున్నాడు.. పూనమ్ బంతిని భలే తిప్పేస్తోంది.. రాధ స్పిన్‌తో మాయ చేస్తోంది.. శిఖా పేస్‌తో హడలెత్తిస్తోంది.. హర్మన్, స్మృతి, జెమీమా అందరూ మంచి క్రికెటర్లే లాంటి మాటలు వినిపిస్తున్నాయి. అమ్మాయిల క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఈ మార్పు వెనక
దేశంలో ఏదైనా క్రీడకు ఆదరణ దక్కాలంటే దాని వెనక ఎన్నో ఏళ్ల కష్టం దాగి ఉండాలి. పురుషాధిక్యత మెండుగా ఉన్న క్రికెట్ లాంటి క్రీడల్లో అయితే అమ్మాయిలు గుర్తింపు దక్కించుకోవాలంటే శక్తికి మించి శ్రమించాలి. భారత మహిళల జట్టు అదే చేసింది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి అన్నీ తానై జట్టు భారాన్ని మోసిన మిథాలీరాజ్‌ను ఆదర్శంగా తీసుకున్న యువ రక్తం జట్టులో చేరింది. దూకుడు అలవడింది. దానికి మెరుగైన వసతులు, అత్యుత్తమ శిక్షణ తోడైంది. ఆటపై అంకితభావం, ప్రపంచానికి తామెంటో చాటిచెప్పాలనే కసి రగిలింది. సరైన అవకాశం దొరకాలే కానీ అదరగొట్టేందుకు సిద్ధమైంది.
2017 వన్డే ప్రపంచకప్ రూపంలో ఆ అవకాశం దరిచేరింది. ఆ టోర్నీలో ఫైనల్ చేరి ఒక్కసారిగా దేశప్రజల దృష్టిని ఆకర్షించింది. తమ గురించి మాట్లాడుకునేలా చేసింది. తుదిపోరులో ఆ జట్టు ఓడినప్పటికీ మేమంటూ ఉన్నామనే గుర్తింపు దక్కింది. అక్కడి నుంచి అమ్మాయిల మ్యాచ్‌లను అనుసరించే వారి సంఖ్య పెరిగింది. బీసీసీఐ.. మహిళా జట్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ తర్వాత 2018 టీ20 ప్రపంచకప్ సెమీస్ వరకూ చేరగలిగిన జట్టు తమ సామర్థ్యాన్ని మరోసారి చాటింది. ఈ సారి గ్రూప్ దశ నుంచి అదిరే ప్రదర్శనతో అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టిన జట్టు.. ఆఖరి సమరంలో తడబడింది. కానీ ఈ ప్రదర్శన దేశంలో అమ్మాయిల క్రికెట్‌ను మరింత ఉన్నతస్థాయికి చేరుస్తుందనే నమ్మకాన్ని కలిగించింది.
తారలు వస్తున్నారు
గతంలో మహిళల జట్టు గురించి కాస్త అవగాహన ఉన్న వాళ్లకు తెలిసిన ఒకే ఒక్క పేరు మిథాలీ రాజ్. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత జట్టులోని చాలామంది క్రికెటర్లకు ప్రత్యేకంగా అభిమానులూ ఉండటం విశేషం. 16 ఏళ్ల వయసులోనే ఎలాంటి బెరుకు లేకుండా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిన షెఫాలీ.. రానున్న రోజుల్లో జట్టుకు కీలకంగా మారనుంది. ఆఫ్‌స్పిన్‌తో ఆకట్టుకున్న 19 ఏళ్ల రాధ.. భవిష్యత్‌పై భరోసాను పెంచుతోంది. దీప్తి, జెమీమా, తనియా, రిచా లాంటి యువ క్రికెటర్లు జట్టుకు బలం కానున్నారు. ప్రస్తుత జట్టులోని సగటు వయసు 23 ఏళ్లే. పూర్తిగా నిండిపోయిన మైదానంలో తీవ్ర ఒత్తిడిని జయించలేక.. స్మృతి, హర్మన్ లాంటి సీనియర్ బ్యాటర్లు రాణించకపోవడం ఫైనల్లో జట్టును దెబ్బతీసింది. కానీ ఈ జట్టు భారీ టోర్నీల్లో ఒత్తిడిని అధిగమించగలిగతే త్వరలోనే విశ్వవిజేతగా నిలుస్తుంది.
గెలుస్తుందనే అంచనాలతో 2003 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన పురుషుల జట్టు ఫైనల్లో ఇదే రీతిలో నిరాశజనక ప్రదర్శనతో నిష్క్రమించింది. ఆ తర్వాత 2011లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. అమ్మాయిలూ అదే బాటలో సాగి.. ప్రపంచకప్‌ను త్వరలోనే అందుకుంటారేమో చూద్దాం.