కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు... టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. ఇటీవలే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలపై వరుసగా సిరీస్‌లు గెలిచి జోరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంపై టీమిండియా ప్రదర్శనపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. భారత బౌలింగ్ దళం.. ఏ దేశంలోనైనా, ఎటువంటి పిచ్‌లపై అయినా చెలరేగుతోందని అన్నాడు.

" టెస్టు క్రికెట్‌పై ఆసక్తి కోల్పోకుండా ఉండాలంటే ఆటలో ప్రమాణాలు అత్యధిక స్థాయిలో ఉండాలి. భారత్‌లో ప్రతిభకు కొదవలేదు. ఆర్థికంగా ఆటగాళ్లకు మంచి మద్దతు దొరుకుతోంది. యువ క్రికెటర్లకు ఐపీఎల్ ఇంకా అద్భుతమైన అవకాశంగా మారింది. రాణించాలని కసి ఉన్న జట్టు ఎప్పుడూ ఇలానే అత్యుత్తమంగా ఉంటుంది. ఏదేశానికైనా ఇదే విధానం పాటించాలి"
-- ఇయాన్ చాపెల్, ఆసీస్ దిగ్గజ క్రికెటర్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పక్కనపెట్టినా... ఇషాంత్, ఉమేశ్, షమి తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిపోయారు.
ప్రస్తుతమున్న పేస్ బౌలింగ్‌తో ప్రపంచంలోని ఎక్కడైనా భారత్ పోరాడగలదని అభిప్రాయం వ్యక్తం చేశాడు చాపెల్. స్పిన్ విభాగం భారతకు మరికొంత బలమని అన్నాడు.

ఐపీఎల్లో ప్రదర్శన ద్వారా యువ క్రికెటర్లకు జాతీయ జట్టులోకి అవకాశాలిచ్చే పద్ధతి బాగుందని ప్రశంసించాడు ఇయాన్. కోహ్లీ.. తన ఆటతీరుతో పాటు సారథిగానూ అత్యుత్తమంగా రాణిస్తున్నాడని అన్నాడు.
వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది బంగ్లాదేశ్. ఈ పర్యటనలో భాగంగా మొదటి టీ20 దిల్లీ (నవంబర్ 3), రెండో మ్యాచ్ రాజ్‌కోట్ (7న), మూడోది నాగ్‌పుర్ (10న)లో జరగనున్నాయి. రెండు టెస్టుల ప్రపంచ ఛాంపియన్‌షిప్ నవంబర్ 14న నుంచి ఆరంభమవుతుంది. ఇండోర్, కోల్‌కతా వేదికలు.