అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే కొన్ని జట్లు ఆపరేషన్ టీ20 కప్‌ను ప్రారంభించగా.. మరికొన్ని అదే బాటలో ఉన్నాయి. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌తో టీమిండియా కూడా పొట్టి కప్‌కు సన్నాహాలు మొదలుపెడుతోంది. ఇక నుంచి జట్టుకు, ఆటగాళ్లకు ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి పోరూ పరీక్షే. ఈ సమయంలో బౌలింగ్ విభాగంపై స్పందించాడు విరాట్.
ఒక్కరికే అవకాశం..
పేస్‌దళంలో చేరడానికి మరొక్కరికే అవకాశం ఉందని సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్‌కు చోటు ఖాయమని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20 సందర్భంగా హైదరాబాద్‌లో భారత మీడియాతో మాట్లాడాడు విరాట్.
" ఒక్క స్థానం కోసమే పోటీ తీవ్రంగా ఉంది. దాదాపుగా ముగ్గురు చోటు ఖాయం చేసుకున్నారు. ఇదో ఆరోగ్యకరమైన పోటీ. జట్టులో చోటు కోసం ఎక్కువ మంది పోటీపడుతుండటం పెద్ద సమస్యేమీ కాదు. భువి, బుమ్రా అనుభవమున్న బౌలర్లు. టీ20ల్లో వారు అత్యంత నిలకడగా రాణిస్తున్నారు. దీపక్ చాహర్ కొత్తగా వచ్చినా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. భువి, షమి టీ20 జట్టులో చేరితే టీమిండియా బౌలింగ్ పటిష్ఠంగా మారుతుంది. కండరాల ఇబ్బందితో విశ్రాంతి తీసుకున్న భువి... విండీస్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అతడు వెస్టిండీస్‌లో ఈ ఏడాది ఆగస్టులో చివరి టీ20 ఆడాడు. మహ్మద్ షమి పరిమిత ఓవర్ల క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. లయ అందుకొని, టీ20 అవసరాలను తీర్చగలిగితే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చాలా ఉపయోగకరం."
-విరాట్ కోహ్లీ, భారత జట్టు సారథి
"షమి.. కొత్త బంతితో వికెట్లు తీయగలడు. యార్కర్లు సంధించే వేగం అతడికుంది. ముగ్గురు సీమర్లతో పాటు మరొక అవకాశం కోసం కొందరు యువకులు పోటీపడుతున్నారు. అందరూ బాగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి చక్కని పోటీ మాత్రమే కాకుండా అందరికీ ఇదొక అవకాశం" అని కోహ్లీ తెలిపాడు. షమి 2017లో చివరిగా టీ20 మ్యాచ్ ఆడాడు.