ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే సందడికి మరోపేరు. ఆత్రుత.. ఉత్సాహం.. ఉత్కంఠ.. ఆనందాల కలబోత. లీగులోని ఫ్రాంచైజీలు ఇందుకోసమే కంకణం కట్టుకుంటాయి. అభిమానులను అలరించేందుకు ఎంత సాహసం చేసేందుకైనా సిద్ధమే అంటాయి. ఫ్రాంచైజీల సోషల్ మీడియా అడ్మిన్లు సైతం అవతలి జట్లపై పంచ్‌లు వేస్తూ నవ్విస్తుంటారు. ప్రత్యర్థిని కవ్విస్తుంటారు. రాజస్థాన్ రాయల్స్ చేసిన ఓ ట్వీటుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇలాగే కవ్వించింది.
ఐపీఎల్ సరికొత్త సీజన్ వేలం ఫిబ్రవరి 18న జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ నలుగురి చిత్రాలను పోస్ట్ చేసి ఎవరిని ఎంపిక చేసుకోవాలని కోరింది. లగాన్ చిత్రంలో ఆమిర్ ఖాన్, తారక్ మెహతా కా ఉల్టా చష్మా నటుడు దిలీప్ జోషి (జెఠాలాల్) మరో ఇద్దరు సినిమా క్రికెటర్లు అందులో ఉన్నారు. దీనికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పందించింది. 'మేం మా క్రికెటర్‌ను ఎంపిక చేసుకున్నాం' అంటూ సినీ నటుడు బ్రహ్మానందం జిఫ్‌ను పోస్ట్ చేసింది. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాలో గచ్చిబౌలి దివాకర్‌గా బ్రహ్మీ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా మరికొన్ని సినిమాల్లో బ్రహ్మానందం క్రికెట్ పేరడీలు చేస్తుంటారు.
ఇదీ చూడండి: 'భారత్‌కు హ్యాట్సాఫ్.. ఆటగాళ్ల ప్రదర్శన మరువలేనిది'