అంతర్గత విభేదాల వల్ల దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును ఇటీవల ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని తాము అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి తీసుకెళ్లినట్లు ఆ దేశ క్రీడామంత్రి నాథి థెథ్వా తెలిపారు. చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతి దేశ క్రికెట్ బోర్డు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ఐసీసీ రూపంలో మరో చిక్కును దక్షిణాఫ్రికా క్రికెట్ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదే జరిగితే బోర్డును రద్దు చేయొచ్చు లేదా మళ్లీ స్వతంత్ర పాలన వచ్చేవరకు ఆ దేశ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించవచ్చు. కాబట్టి తాజా పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఇదీ జరిగింది
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో ఘోరంగా విఫలమైన సఫారీ జట్టు.. కేవలం మూడు మ్యాచ్ల్లో గెలిచి ఇంటిముఖం పట్టింది. డివిలియర్స్ రిటైర్మెంట్ను వెనక్కు తీసుకుని తిరిగి జట్టులోకి వస్తానన్నా సరే.. ఆ విషయం పట్టించుకోవడం మానేశారు. దీంతో పాటు బోర్డులో అంతర్గత కుమ్ములాటలు, సభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం లాంటి అంశాలు తలనొప్పిగా మారుతుండటం వల్ల ప్రభుత్వం జోక్యం చేసుకుంది.