బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రక్త నాళాల్లో ఏర్పడిన పూడికలను తొలగించడానికి మరో రెండు స్టంట్లు వేసిన వైద్యులు.. గురువారం రాత్రి ఆయన సౌకర్యవంతంగా నిద్రపోయినట్లు చెప్పారు. అవసరమైన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించడానికి యోచిస్తున్నామని వెల్లడించారు.
"సౌరభ్ గంగూలీ ఆరోగ్యం స్థిరంగా ఉంది. అవసరమైన పరీక్షలు చేయడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నారు. సీనియర్ డాక్టర్లు చూశాక ఆయన్ని.. వేరే వార్డుకు తరలించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోనున్నాం" అని అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
రెండ్రోజుల క్రితం స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన గంగూలీకి.. ప్రముఖ కార్డియాలజిస్టులు డా.దేవి శెట్టి, డా.అశ్విన్ మెహాతాలతో కూడిన వైద్య బృందం యాంజియోప్లాస్టీ నిర్వహించారు.
సీఎం మమతా సందర్శన..
రెండోసారి యాంజియోప్లాస్టీ చేయించుకున్న మాజీ ఇండియన్ కెప్టెన్ గంగూలీని.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. ఆయన త్వరగానే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
"సౌరభ్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఆసుపత్రిలో అతడి భార్య డోనాను కలిశాను" అని సీఎం మమతా పేర్కొన్నారు. విజయవంతంగా యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యబృందానికి ఆమె అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: భారత్-ఇంగ్లాండ్ సిరీస్.. టాప్-3లో ఎవరు బెస్ట్?