భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ వారసుడిగా మన్ననలు పొందుతున్న కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. మాస్టర్ సాధించిన 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ప్రస్తుతం 68 శతకాలు సాధించిన విరాట్... ఇదే ఫామ్ కొనసాగిస్తే కచ్చితంగా సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. కోహ్లీ ఎన్ని రికార్డులను నెలకొల్పినా.. సచిన్ సాధించిన ఓ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేడని చెప్తున్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. వీలైతే సాధించేందుకు ప్రయత్నించాలని కోహ్లీకి సవాల్ విసిరాడు.
" సచిన్ తెందుల్కర్ పేరిట 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఉంది. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లు అన్ని టెస్ట్ మ్యాచ్‌లు కచ్చితంగా ఆడలేరు. ఈ శకంలో విరాట్ కోహ్లీ మేటి బ్యాట్స్మెన్ అయినా సచిన్ రికార్డును బ్రేక్ చేయలేడు".
-- సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్
విరాట్ కోహ్లీ, స్టీవ్‌స్మిత్‌లో ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్ అనే ప్రశ్నకూ సమాధానమిచ్చాడు సెహ్వాగ్. స్మిత్ కన్నా కోహ్లీయే అత్యుత్తమ ఆటగాడని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వీరిద్దరినీ చూస్తే స్మిత్ కన్నా కోహ్లీ ఆట చూడముచ్చటగా ఉంటుందని చెప్పాడు. అంతేకాకుండా శతకాలు బాదడంలో విరాట్ బెస్ట్ అని వీరూ వెల్లడించాడు.
ఐసీసీ ఇటీవల విడుదల చేసిన టెస్టు ర్యాంకుల జాబితాలో... కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ మూడు నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకాడు. వీరిద్దరి మధ్య 9 పాయింట్ల అంతరం ఉంది. కోహ్లీ ఇప‍్పటివరకు 77 టెస్టులు ఆడగా... స్మిత్ 66 మ్యాచ్‌లు ఆడాడు.
ఇదీ చూడండి...'కోహ్లీ.. నీలో నన్ను నేను చూసుకుంటున్నా'