టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంతటి ప్రశాంతమైన ఆటగాడో అందరికీ తెలుసు. ఏ పరిస్థితుల్లోనైనా భావోద్వేగాలను నియంత్రించుకునే నైజం అతడిది. అలాంటి ధోనీకి కోపం తెప్పించేది తానొక్కదాన్నేనని అంటోంది అతడి సతీమణి సాక్షి. గురువారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా చెన్నై టీమ్ ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. అందులో ధోనీ గురించి పలు విషయాలు మాట్లాడింది.
"ధోనీకి కోపం తెప్పించేది నేనొక్కదాన్నే. ప్రతి విషయంలోనూ అతడెంతో ప్రశాంతంగా ఉంటాడు. కానీ నేనే ఆటపట్టిస్తుంటా. ఎందుకంటే అతడితో సన్నిహితంగా ఉండేది నేనొక్కదాన్ని మాత్రమే. ఇక మేం ఇంట్లో ఉన్నప్పుడు క్రికెట్ గురించి అస్సలు మాట్లాడుకోం. అది అతడికి ఇష్టమైన ఆట. అదొక ప్రొషెషన్. ఎవరైనా ఒక వ్యక్తి ఆఫీస్‌కు వెళ్లొచ్చాక.. 'ఈ రోజు ఎలా గడిచింది? మీ బాస్ ఏమన్నారు' ఇలాంటివన్నీ మాట్లాడకూడదు. వాళ్ల పని గురించి, ఇష్టపడే దాని గురించి అస్సలు చర్చించొద్దు" అని సాక్షి పేర్కొంది.
ఇక తమ గారాల పట్టి జీవా గురించి మాట్లాడుతూ.. తన మాట అస్సలు వినదని, ఎన్నిసార్లు తినమన్నా పట్టించుకోదని తెలిపింది. అదే ధోనీ చెప్తే ఇట్టే తినేస్తుందని చెప్పింది. ధోనీ కెరీర్ ఆరంభంలో పొడవాటి నారింజ రంగు జుట్టు సాక్షి మాట్లాడుతూ.. "అదృష్టం కొద్దీ నేనతడిని అలాంటి జుట్టుతో చూడలేదు. ఒకవేళ అలా చూసుంటే తర్వాత మళ్లీ చూసేదాన్నే కాదు. ఆ పొడవాటి జుట్టు జాన్ (అబ్రహం)కు సరిపోయింది కానీ మహీకి సెట్ కాదు" అని సాక్షి చెప్పుకొచ్చింది.