విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్లు అదరగొట్టేశారు. టీ విరామ సమయానికి 59.1 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 202 పరుగులు చేశారు. ఆ తర్వాత వర్షం పడటం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. కాసేపటికి తొలిరోజు మ్యాచ్ ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ(115*), మయాంక్(84*)తో ఉన్నారు.
ఆరంభమే అదిరింది...
టాస్ గెలిచిన సారథి విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముందుగా అనుకున్నట్లే మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మను ఓపెనింగ్‌కు పంపించాడు. విజయనగరంలో జరిగిన సన్నాహక పోరులో డకౌట్ కావడం వల్ల అందరి చూపు హిట్‌మ్యాన్‌పైనే నిలిచింది. తొలి సెషన్‌లో దక్షిణాఫ్రికా పేసర్లు అద్భుతమైన పేస్ రాబట్టారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రోహిత్... నెమ్మదిగా కుదురుకొని వీలైన సమయంలో బౌండరీలు కొట్టాడు. పేసర్ల బౌలింగ్ ముగియగానే స్పిన్నర్లే లక్ష్యంగా ఆడాడు. చక్కని షాట్లు బాదాడు. ఎరుపు బంతిని తనెంత స్టైల్‌గా ఆడగలడో చూపించాడు. మయాంక్ కూడా స్పిన్నర్ల బౌలింగ్‌ను ఉతికారేశాడు. ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 84* (183 బంతుల్లో; 11×4, 2×6)తో కలిసి రోహిత్ శర్మ 115*(174 బంతుల్లో; 12ఫోర్లు, 5సిక్సర్లు) పరుగులు చేశారు.
రికార్డులు...
- ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే శతకంతో ఆకట్టుకున్న రోహిత్.. పలు రికార్డులు నమోదు చేశాడు. కొన్నింటిని అధిగమించేందుకు చూస్తున్నాడు. ఓపెనర్‌గా ఆడిన తొలి టెస్టులో అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్ ధావన్. ఆస్ట్రేలియాతో ఆ మ్యాచ్‌లో 187 పరుగులు చేశాడు. అంతకంటే ఎక్కువ పరుగులు చేసి, ఆ రికార్డు బ్రేక్ చేయాలని చూస్తున్నాడు హిట్ మ్యాన్.
- స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యధిక సగటు సాధించిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు రోహిత్. ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ 98.22తో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో రోహిత్(91.22), ఆడమ్ వోజెస్(86.25), డగ్లస్ జర్డయిన్(81.66), జార్జ్ హెడ్లీ(77.56) ఉన్నారు.