ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 వేలం కోసం సర్వం సిద్ధమైంది. చెన్నైలో జరగనున్న ఈ వేలంలో 292మంది పోటీలో ఉండగా.. వీరిలో 164 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ కూడా ఈ సారి పోటీలో ఉన్నాడు. మొత్తం అందుబాటులో ఉన్న స్లాట్లు 61 మాత్రమే. వికెట్ కీపర్, టాపార్డర్, మిడిలార్డర్, బౌలింగ్ దళం.. ఇలా అన్ని విభాగాలను పటిష్ఠం చేసుకోవడానికి ఫ్రాంఛైజీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే జట్లు ఏ ఆటగాళ్లను కొనేందుకు యోచిస్తున్నాయో తెలుసుకుందాం.
- మొత్తం 61 ఖాళీల్లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 11 మందిని తీసుకొనే అవకాశముంది. ఈ ఫ్రాంఛైజీ వద్ద రూ. 35.4 కోట్లు ఉన్నాయి.
- కనిష్ఠంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 10.75 కోట్లు ఉండగా.. ముగ్గురిని మాత్రమే తీసుకొనే అవకాశాలున్నాయి.
- గరిష్ఠంగా పంజాబ్ కింగ్స్ వద్ద రూ. 53.20 కోట్లు ఉన్నాయి. అందుబాటులో ఉన్న స్లాట్లు 9.
- బిగ్ హిట్టర్లు మ్యాక్స్‌వెల్, మొయిన్ అలీ సహా ప్రపంచ నెం.1 టీ-20 ఆటగాడు డేవిడ్ మలన్, బెంగళూరు వదులుకున్న క్రిస్ మోరిస్, రాజస్థాన్ వదులుకున్న స్టీవ్ స్మిత్‌లు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.
కరోనా దృష్ట్యా ఐపీఎల్-13 యూఏఈలో నిర్వహించగా.. ఈసారి భారత్‌లోనే జరిగే అవకాశాలు ఎక్కువ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)
విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో మొత్తం 11 స్లాట్లు ఉన్నాయి. అంటే గరిష్ఠంగా 11 మందిని కొనుగోలు చేయొచ్చు. ఈ జట్టు వద్ద రూ. 35.4 కోట్ల బడ్జెట్ ఉంది. ఈ మొత్తం స్లాట్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఆర్సీబీకి ఉంది. అయితే.. క్రిస్ మోరిస్, మొయిన్ అలీ, ఆరోన్ ఫించ్‌ను వదులుకున్న బెంగళూరు జట్టు మెరుగైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ అవకాశం గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు లభించే అవకాశం కనిపిస్తోంది. ఇతనిపై పలు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి: 'ఆర్సీబీ.. మాక్స్‌వెల్‌ను దక్కించుకోవచ్చు'
ఆల్‌రౌండర్‌గా షకీబుల్ హసన్‌ను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)
ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో బలమైన టీమ్‌గా రాణించింది. కానీ, 2020 సీజన్లో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచింది. అయితే.. హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, మురళీ విజయ్, పియూష్ చావ్లాను సీఎస్కే వదులుకుంది. ప్రస్తుతం సీఎస్కే వద్ద రూ. 19.9 కోట్ల బడ్జెట్‌తో ఆరుగురు ఆటగాళ్లను కొనుక్కునే సామర్థ్యం ఉంది.
సీఎస్కే బిగ్ హిట్టర్ల కోసం చూస్తోంది. మిడిలార్డర్లో ఎలాగూ రైనా, డుప్లెసిస్ ఉండనే ఉన్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ మినహా మిగతా ఐదు స్థానాల్లో భారత ఆటగాళ్లనే తమ జట్టులో చేర్చుకునేందుకు సీఎస్కే సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి:ఐపీఎల్-2021 వేలం: ఈ విషయాలు తెలుసుకోండి!
పంజాబ్ కింగ్స్..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ఈసారి పంజాబ్ కింగ్స్‌గా బరిలోకి దిగుతోంది. ఐపీఎల్‌కు ముందు పేరు, లోగో మార్చింది. ఈ ఫ్రాంఛైజీ వద్ద అత్యధికంగా రూ. 53.20 కోట్ల బడ్జెట్ ఉంది. ఆర్సీబీ జట్టు తర్వాత ఉత్తమ విదేశీ ఆటగాళ్లను కొనేందుకు ప్రయత్నిస్తున్న జట్టు పంజాబ్. బడ్జెట్ భారీగా ఉన్న నేపథ్యంలో డేవిడ్ మలన్ కోసం ప్రయత్నించనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: ఐపీఎల్: కొత్త పేరు, లోగోతో బరిలోకి పంజాబ్
వదులుకున్న ఆటగాళ్లు: గ్లెన్ మ్యాక్స్‌వెల్, ముజీబ్ ఉర్ రెహమాన్, షెల్డన్ కాట్రెల్, జిమ్మీ నీషమ్.
తీసుకోనున్న ఆటగాళ్లు: ఆరోన్ ఫించ్/అలెక్స్ హేల్స్, షకిబుల్ హసన్, స్టీవ్ స్మిత్.
స్పిన్ బౌలర్లలో హర్భజన్ సింగ్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేసర్‌గా రిచర్జ్సన్ లేదా మార్క్ వుడ్‌కు స్థానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఐపీఎల్ వేలం: ఈ బౌలర్లు, ఆల్రౌండర్లపైనే దృష్టి!
రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ వేలానికి ముందు రాజస్థాన్ జట్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్టీవ్ స్మిత్‌ను వదులుకొని సంజూ శాంసన్‌ను జట్టు సారథిగా ప్రకటించింది. ఒషానే థామస్, టామ్ కరన్లనూ వదులుకోవడం వల్ల జట్టు దగ్గర రూ. 34.85 కోట్ల బడ్జెట్ ఉంది. ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో కలిపి మొత్తంగా 8 మంది కొత్త ఆటగాళ్లను జట్టులో చేర్చుకోనుంది రాజస్థాన్ రాయల్స్.
తీసుకోనున్న ఆటగాళ్లు: డేవిడ్ మలాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్. మిడిలార్డర్ కోసం మార్నస్ లబుషేన్నూ తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాతియా వంటి ఆల్‌రౌండర్లు.. మయాంక్ మార్కండే, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ లాంటి కీలక పేసర్లున్న జట్టులో మరింత జోష్ వచ్చేందుకు టిమ్ సౌథీని కొనేందుకు యోచిస్తోంది రాజస్థాన్.
ఇదీ చదవండి:ఐపీఎల్ వేలం: ఈ ఏడాది జాక్‌పాట్ ఎవరికో?
ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్..
ఈ నాలుగు జట్లు దాదాపు 2020 ఐపీఎల్ సీజన్ ఆటగాళ్లనే తమ జట్టులో కొనసాగించే నిర్ణయం తీసుకున్నాయి. ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే స్వదేశీ ఆటగాళ్ల ఎంపిక విషయంలో కాస్త పునరాలోచన చేసేందుకు సిద్ధమవుతున్నాయి. విదేశీ ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఈ నాలుగు జట్లూ పూర్తి స్థాయిలో బలంగా కనిపిస్తున్నాయి.
అందరి చూపు వీరిపైనే..
ఐపీఎల్ వేలంకు సర్వం సిద్ధమైన వేళ.. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీపై అన్ని జట్ల దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ రూ. 2 కోట్ల ధర మార్క్‌లో ఉన్నా.. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ అందరి దృష్టిని ఆకట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ధరల వారీగా ఆటగాళ్లు
రూ. 2 కోట్లు- హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, షకీబుల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్
రూ. 1.5 కోట్లు- ఈ మార్క్‌లో 12 మంది ఆటగాళ్లు ఉన్నారు.
రూ. 1 కోటి- ఈ మార్క్‌లో 11 మంది ఆటగాళ్లు ఉండగా.. హనుమ విహారి, ఉమేశ్ యాదవ్ భారత ఆటగాళ్లు.
ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం ఎప్పుడు, ఎక్కడ?- వివరాలివే