భారత జట్టుకు మరో యువ హిట్టర్ దొరికాడు. సెహ్వాగ్ టీమిండియాకు దూరమయ్యాక ఓపెనింగ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడేవాళ్లు తక్కువయ్యారు. నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నడిపిస్తోన్న వాళ్లకు నేనూ రేసులో ఉన్నా అంటు మరోసారి వార్తల్లో నిలిచాడు ముంబయి యువ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్.
తొలి ట్రిపుల్...
వాంఖడే వేదికగా బుధవారం ముగిసిన రంజీ మ్యాచ్‌లో... ముంబయి జట్టు తరఫున ఆడిన 22 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ కెరీర్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 391 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 30 ఫోర్లు, 8 సిక్సర్లు సాధించి... 301 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తుచేశాడు. చివరికి మ్యాచ్ డ్రాగా ముగియగా.. కెరీర్‌లో సర్ఫరాజ్ మాత్రం అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్నాడు. సర్ఫరాజ్ కెరీర్ ఆరంభంలో ఉత్తర్‌ప్రదేశ్ జట్టులోనే ఆడటం విశేషం.
ముంబయి తరఫున త్రిశకతం సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు సర్ఫరాజ్. ఇంతకు ముందు సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చంట్, అజిత్ వాడేకర్ ఈ ఘనత సాధించారు. ఇప్పటికి ముంబయి ఆటగాళ్లు 8 త్రిశతకాలు నమోదు చేయగా... వసీం జాఫర్ రెండుసార్లు ఈ ఫీట్ అందుకున్నాడు.
ఆదివారం మొదలైన నాలుగు రోజుల టెస్టులో టాస్ గెలిచిన ఉత్తర్‌ప్రదేశ్ జట్టు... మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టులో ఉపేంద్ర (203), అక్షదీప్ (115) రాణించగా.. తొలి ఇన్నింగ్స్‌ను 625/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన ముంబయి జట్టులో సర్ఫరాజ్ (301*), సిద్దేశ్ (98), ఆదిత్య (97) ప్రత్యర్థి జట్టుకు గట్టిపోటీ నిచ్చారు. ఫలితంగా 688/7 స్కోరు వద్ద ముంబయి డిక్లేర్ చేసింది. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 1,313 పరుగులు నమోదయ్యాయి.
- ' class='align-text-top noRightClick twitterSection' data=''>
కోహ్లీ జట్టులో...
2015 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లని స్వీప్, రివర్స్ స్వీప్, దిల్‌స్కూప్ షాట్లతో ఆటాడుకున్నాడు. ఆ తర్వాత 2016లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఫిట్‌నెస్ కారణంగా ఈ కుర్రాడి కెరీర్ గాడి తప్పింది. గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఆడిన సర్ఫరాజ్... చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ నిరాశపర్చాడు.