భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వివరాలను ఐసీసీ తప్పుగా రాయడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ద్రవిడ్ గతేడాది హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. దీనిలో భాగంగా మిస్టర్ వాల్ బయోను తన వెబ్సైట్లో పొందుపర్చిన ఐసీసీ...అతడిని ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా పేర్కొంది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం పొందిన ఐదో భారతీయ ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ ఘనత సాధించాడు. ఈ అవార్డును మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా అందుకున్నాడు. అంతకుముందు అనిల్ కుంబ్లే(2008), బిషన్ సింగ్ బేడి(2009), కపిల్ దేవ్(2009), సునీల్ గావస్కర్(2009), భారత తరపున హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.
పదివేల పరుగుల వీరుడు...
టీమిండియా తరఫున 164 టెస్టులు ఆడిన ద్రవిడ్ 13వేల 288 పరుగులు చేశాడు. ఇందులో 36 శతకాలు ఉన్నాయి. 344 వన్డేల్లో 10వేల 899 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. వీటితో పాటు 2004లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డునూ గెల్చుకున్నాడు. 1996లో భారత జట్టు తరఫున అంతర్జాయతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రాహుల్ ద్రవిడ్... 2012లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.