నెలలపాటు ఖాళీగా ఉన్న క్రికెటర్లకు ఆట మొదలైన ఆరంభంలో పూర్తి తీవ్రతతో ఆడటం కష్టమని అభిప్రాయపడింది భారత మహిళ జట్టు స్పిన్నర్ పూనమ్ యాదవ్. చివరగా మార్చిలో ఆస్ట్రేలియాతో టీ20 ఫైనల్ ఆడిన ఈమె.. పలు విషయాలు వెల్లడించింది.
"నాలుగైదు నెలల తర్వాత మైదానంలో అడుగుపెడితే ఏ క్రికెటర్‌కైనా పూర్తిస్థాయిలో ప్రదర్శన ఇవ్వడం కష్టమే. కానీ మమ్మల్ని మేం ఫిట్‌గా ఉంచుకుంటున్నం. సమూహంగా సాధన చేయడానికి మాకు అనుమతి లభించింది. 20-25 రోజుల్లో మేం పూర్తి ఫిట్నెస్ సాధిస్తాం" అని పూనమ్ చెప్పింది.
షెడ్యూల్ ప్రకారం భారత మహిళా జట్టు సెప్టెంబరులో ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. కరోనా కారణంగా అది రద్దయింది. తర్వాత పెద్ద టోర్నీ అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే ప్రపంచకప్పే. కానీ ప్రాణాంతకర వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దాని నిర్వహణ సందేహంగా మారింది. ఈ విషయమై ఐసీసీ, రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనుంది.