గబ్బాలో ఆ 89.. అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. టీమ్ ఇండియా నయా పోరాట స్ఫూర్తికి సాక్ష్యంగా కోట్లాది అభిమానుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. అది అతడి సామర్థ్యంపై సందేహాలను పటాపంచలు చేసిన ఇన్నింగ్స్! అది అతడి ఒడుదొడుకుల కెరీర్‌ను అమాంతంపై పైకెత్తిన ఇన్నింగ్స్. అది పంత్ కెరీర్‌కే కాదు.. భారత క్రికెట్ భవితకే గొప్ప మలుపు.
ఆఖరి రోజు. 300పై లక్ష్య ఛేదన. అదీ విదేశాల్లో, అదీ ఆస్ట్రేలియాలో.. ఆపై గబ్బాలో..! టీమ్‌ఇండియా అభిమానులు కల కూడా కనడానికి సాహసించలేని సవాల్ అది. డ్రా చేసుకున్నా సంతోషించే వాళ్లు. నిజానికే అదే సాధ్యంగా కనిపించింది కూడా. కానీ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ.. ఓ అపురూప విజయాన్ని అందుకుంది అంటే ప్రధాన కారణం రిషబ్ పంతే. అతడి దూకుడే. 167/3 వద్ద అతడు క్రీజులో అడుగుపెట్టేటప్పటికి.. భారత్ చేయాల్సింది చాలానే ఉంది. కానీ భయమనేదే లేకుండా బ్యాటింగ్ చేసిన అతడు కంగారూలకు షాక్ ఇచ్చాడు. అటు పేసర్లనూ వదల్లేదు.. ఇటు స్పిన్నర్‌పైనా దయచూపలేదు. నిస్సందేహంగా పంత్ కెరీర్‌కు ఇది మేలి మలుపే. ఎందుకంటే కెరీర్ ఆరంభంలో సంచలన ఇన్నింగ్స్‌లతో అందరినీ ఆకట్టుకున్నా.. ఆ తర్వాత అతడు లయ తప్పాడు. అస్థిర ప్రదర్శనతో వన్డే వికెట్ కీపర్ స్థానాన్ని కేఎల్ రాహుల్‌కు కోల్పోయి, టెస్టుల్లోనూ తుది జట్టులో స్థానానికి హామీ లేని స్థితిలో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన అతడికి టెస్టు సిరీస్ పెద్ద పరీక్షే అయింది. తొలి టెస్టులో అవకాశం దక్కలేదు కూడా. కానీ అన్ని ఒత్తిళ్లనూ అధిగమిస్తూ అతడు ఫస్ట్‌క్లాసులో పరీక్ష పాసయ్యాడు. అన్నింటికంటే మిన్నగా పంత్‌లో ఆకట్టుకున్నది బ్యాటింగ్‌లో అతడి చూపిన పరిణతే. భారతజట్టు కోరుకున్నదీ అదే. షాట్ సెలక్షన్ విషయంలో ఇంతకుముందు కోచ్ రవిశాస్త్రి నుంచి కూడా మందలింపునకు గురైన అతడు ఇప్పుడు వికెట్ పారేసుకోవట్లేదు. నిగ్రహంగా ఆడుతున్నాడు. ఎంతో ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ప్రతి బంతినీ బాదాలన్న ఆలోచనను పక్కన పెట్టిన అతడు.. ఆఫ్‌సైడ్ గేమ్‌నూ మెరుగుపర్చుకున్నాడు. కొద్దిలో తప్పింది కానీ.. సిడ్నీ టెస్టులోనూ పంత్ ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియా గెలవాల్సింది. అయినా డ్రాతో సిరీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. అదే జోరును గబ్బాలోనూ కొనసాగించాడు పంత్. మూడు టెస్టులే ఆడిన పంత్ 274 (సగటు 68.50) పరుగులతో సిరీస్‌లో భారత టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.
నాలుగో ఇన్నింగ్స్ హీరో..
నాలుగో ఇన్నింగ్స్‌లో, అంటే ఛేదనలో బ్యాటింగ్ చేయడం ఎంతో కష్టం. ఆస్ట్రేలియా లాంటి చోటైతే ఇంకా కష్టం. చిన్న కెరీర్‌లో వీరోచిత పోరాటాలతో నాలుగో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు పంత్. అతడు తన తొలి టెస్టు శతకాన్ని (ఇంగ్లాండ్‌పై 2018లో) సాధించింది నాలుగో ఇన్నింగ్స్‌లోనే. అతడి కెరీర్ సగటు 43.52 అయితే... నాలుగో ఇన్నింగ్స్ సగటు ఏకంగా 87. మొత్తంగా రెండు శతకాలు, నాలుగు అర్ధశతకాలు బాదేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో 97తో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇప్పుడు 89తో గబ్బాలో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఇదీ చూడండి : వీరే 'గబ్బా'ర్ సింగ్‌లు.. అనుభవం కన్నా పోరాటమే మిన్న!