పాకిస్థాన్‌తో జులైలో జరగాల్సిన మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లను బయో-సెక్యూర్ వాతావరణంలో నిర్వహించాలని ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు కార్యనిర్వాహక అధ్యక్షుడు వసీం ఖాన్ తెలిపాడు.
రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య జరిగిన సంభాషణల ప్రకారం స్టేడియం లోపల హోటళ్లు ఉన్న వాటిని ఎంపిక చేసి తలుపులు మూసేసి మ్యాచ్‌లను నిర్వహించాలన్న ఇంగ్లాండ్ ప్రతిపాదనను పాకిస్థాన్ అంగీకరించింది.
క్రీడాకారుల ఆరోగ్యభద్రత ముఖ్యం
జులై మొదటి వారంలో 25 మంది ఆటగాళ్లు నాలుగు ప్రత్యేక విమానాల్లో ఇంగ్లాండ్‌కు వెళతారని.. నిర్బంధ కాలం తర్వాత సిరీస్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు పీసీబీ ఛీఫ్ తెలిపాడు. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొనాలని ఏ ఆటగాడిపై ఒత్తిడి తీసుకురాబోమని.. ఆట కంటే క్రీడాకారుల ఆరోగ్య భద్రత ముఖ్యమని అన్నాడు. ఒకవేళ తుది జట్టులో ఎంపిక చేసిన ఆటగాడు వెళ్లకూడదనుకుంటే వారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని స్పష్టం చేశాడు. వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోమని వ్యాఖ్యానించాడు.
ప్రభుత్వ అనుమతి తీసుకుంటాం
ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి కచ్చితంగా పొందుతామని పాక్ క్రికెట్ బోర్డు ఛీఫ్ వసీం ఖాన్ తెలిపాడు. టెస్టు సిరీస్ కోసం మాంచెస్టర్, సౌతాంప్టన్ అనే రెండు వేదికలను ప్రకటించగా త్వరలోనే మూడో వేదిక వివరాలను ఇంగ్లాండ్ తెలియజేయనుందని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి.. 'సచిన్‌ను ఔటిస్తే నేను హోటల్‌కి వెళ్లే వాడ్ని కాదేమో!'