సాధారణంగా క్రికెటర్ వయసు 35 దాటిందంటే రిటైర్మెంట్ ప్రకటిస్తుంటారు. కొన్ని సందర్భాలలో కొందరు క్రికెటర్లు ఇంకా ముందే కూడా ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. అయితే 34ఏళ్ల లేటు వయసులో టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసి రికార్డుకెక్కాడు పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ. 13 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై తొలిసారి దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు దీనికి వేదికైంది. పాక్ తరఫున 243వ టెస్టు క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చిన అలీ.. అత్యధిక వయసులో టెస్టు ఎంట్రీ ఇచ్చిన ఆ దేశ ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కూడా తీశాడు. అంతకుముందు తొలి స్థానంలో మిరాన్ బక్ష్ (47ఏళ్లు).. జుల్ఫికర్ బాబర్ (34ఏళ్లు), మహ్మద్ అస్లామ్(34ఏళ్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌట్ అయింది. యాసిర్ షా 3, షాహీన్ అఫ్రిదీ 2 వికెట్లతో రాణించారు. తొలి రోజు ఆట ముగిసేసరికి పాక్ 4 వికెట్లు కోల్పోయి 33 పరుగులు మాత్రమే చేసింది. ఇంకా 187 పరుగుల వెనుకంజలో ఉంది.
చాలా శ్రమించాను.. ఆనందంగా ఉంది
నౌమన్ అలీ.. పాకిస్థాన్ దక్షిణ సింధు రాష్ట్రం సంఘర్ డివిజన్‌కు చెందిన ఖిప్రో అనే చిన్న గ్రామం నుంచి వచ్చాడు. అక్కడే పుట్టి, విద్యాభాసం చేశాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చిన ఇతడు కొనాళ్లు ఇక్కడే ఉండి.. అనంతరం మళ్లీ స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి తండ్రి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నారు. టెస్టు అరంగేట్రంపై నౌమన్ మాట్లాడుతూ.. "టెస్టు ఎంట్రీ ఇవ్వాలనేది నా కల. దీని కోసం చాలా శ్రమించాను. చోటు సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని మ్యాచులు ఆడి బాగా రాణిస్తానని ఆశిస్తున్నాను." అని అన్నాడు.
ఇదీ చూడండి: వాళ్లు వెళ్లిపోతే రిటైర్మెంట్ వెనక్కు తీసుకుంటా:ఆమిర్