కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియాలో జట్టును అద్భుతంగా నడిపించిన రహానె.. తన నాయకత్వ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. జట్టుకు సిరీస్ విజయాన్ని అందించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అయితే తనకు, కోహ్లీకి మధ్య బంధంలో మార్పేమీ లేదని.. అతడు తన కెప్టెనని, తాను ఉపసారథినని రహానె స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌తో కోహ్లీ తిరిగి నాయకత్వ పగ్గాలు అందుకోనుండగా.. రహానె మళ్లీ వైస్‌కెప్టెన్ పాత్రలోకి మారనున్నాడు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఏమైనా భిన్నంగా ఉంటాయా అన్న ప్రశ్నకు రహానె బదులిస్తూ.. "మార్పులేమీ ఉండవు. విరాట్ ఎప్పటికీ టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉంటాడు. నేను ఉపసారథిగా ఉంటా. అతడి గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించడం, జట్టును విజయపథంలో నడిపించడానికి అత్యుత్తమ ప్రదర్శన చేయడం నా బాధ్యత" అని చెప్పాడు.
అతడు చురుకైన నాయకుడు
కెప్టెన్‌గా ఉండడం ముఖ్యం కాదని, ఆ పాత్రను సమర్థంగా పోషించే సామర్థ్యం ఉండడం ముఖ్యమని రహానె అన్నాడు. "కేవలం కెప్టెన్‌గా ఉండడం ప్రధానం కాదు. సారథ్య బాధ్యతలో ఎలా రాణించామన్నది ముఖ్యం. ఇప్పటివరకు నేను ఆ పాత్రలో విజయవంతమయ్యా. ముందు ముందుకు కూడా జట్టుకు ఇలా ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తా" అని చెప్పాడు. కోహ్లీతో తన మంచి అనుబంధం ఉందని తెలిపాడు. "నాకు, విరాట్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. అతడు నా బ్యాటింగ్‌ను పదే పదే పొగుడుతాడు. భారత్‌లో, విదేశాల్లో మేమిద్దరం జట్టు కోసం చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాం. కోహ్లి నాలుగో స్థానంలో, నేను అయిదో స్థానంలో రావడం వల్ల ఎన్నో భాగస్వామ్యాలు నెలకొల్పాం. మేం ఒకరికి ఒకరం ఎప్పుడూ మద్దతుగా ఉంటాం. ఇద్దరం క్రీజులో ఉండగా ఒకరు నిర్లక్ష్యంగా షాట్ ఆడితే మరొకరు హెచ్చరిస్తారు" అని అన్నాడు. కోహ్లి కెప్టెన్సీ గురించి రహానె మాట్లాడుతూ.. "విరాట్ చురుకైన సారథి. మైదానంలో మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. ఎప్పుడు స్పిన్నర్లు బౌలింగ్‌కు వచ్చినా నాపై ఆధారపడతాడు. నేను స్లిప్స్‌లో బాగా క్యాచ్‌లు పట్టగలనన్నది అతడి నమ్మకం. విరాట్ నా నుంచి ఎంతో ఆశిస్తాడు. అతడి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఉండడానికి నేనెప్పుడూ ప్రయత్నిస్తా" అని చెప్పాడు.
అలా ఎప్పుడూ అనుకోలేదు
గత కొన్నేళ్లలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు జట్టులో స్థానం సురక్షితం అని భావిస్తున్నారా అని అడిగినప్పుడు.. తన స్థానానికి ముప్పు ఉందని ఎప్పుడూ భావించలేదని అన్నాడు. "నిజాయితీగా చెప్పాలంటే.. జట్టులో నా స్థానం ప్రమాదంలో పడ్డట్లు నేనెప్పుడూ భావించలేదు. కెప్టెన్, జట్టు మేనేజ్‌మెంట్‌కు ఎప్పుడూ నాపై విశ్వాసం ఉంది. కొన్ని సిరీస్‌లో ఆటగాడు విఫలం కావొచ్చు. అంటే దానర్థం అతడి క్లాస్ పోయిందని కాదు. ఒక్క ఇన్నింగ్స్ ఆడితే చాలు బ్యాట్స్‌మన్ ఫామ్‌లోకి వస్తాడు. నేను పేలవ ఫామ్‌లో ఉన్నప్పుడు మా కెప్టెన్ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు" అని రహానె చెప్పాడు. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయంలో రహానె కెప్టెన్సీని అందరూ మెచ్చుకుంటున్నా.. అతడు మాత్రం పొంగిపోవట్లేదు. "జట్టును బట్టే కెప్టెన్ ఉంటాడు. ఎప్పుడు సిరీస్ గెలిచినా అది సమష్టి కృషి వల్లే. అది ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాదు. ఒక కెప్టెన్‌ను మంచి కెప్టెన్‌ను చేసేది సహచరులే. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయానికి పూర్తి ఘనత నా జట్టుదే" అని రహానె అన్నాడు.
ఇదీ చూడండి : ఆసీస్ పర్యటనతో ఎన్నో జ్ఞాపకాలు: రహానె