ఐపీఎల్లో సరికొత్త మార్పులకు ఆమోదం తెలిపింది ఐపీఎల్ పాలకవర్గం. నేడు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన ఈ బృందం... పలు కీలక అంశాలపై చర్చించింది. నోబాల్ కోసం ప్రత్యేక అంపైర్‌ను తెరపైకి తీసుకువచ్చి... ఆసక్తి రేకెత్తించిన 'పవర్ ప్లేయర్' విధానాన్ని తోసిపుచ్చింది.
నోబాల్ అంపైర్...
వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచే ఈ సరికొత్త అంపైర్ దర్శనమివ్వనున్నాడు. ప్రత్యేకంగా నోబాల్స్ చూసేందుకే ఇతడు పనిచేస్తాడు. గత ఐపీఎల్లో జరిగిన తప్పిదాలను పరిశీలించాక ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ అంపైర్ ప్రత్యేక సాంకేతికత వాడుతూ నోబాల్స్ గుర్తిస్తాడు. ఇతడిని థర్డ్, ఫోర్త్ అంపైర్‌గా భావించరు.
గత ఐపీఎల్లో ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ గమనించడంలో అంపైర్ల వైఫల్యం కారణంగా చాలా మ్యాచ్‌ల ఫలితాలు తారుమారయ్యాయి. దీనికి చెక్ పెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. తొలుత జాతీయ టీ20 టోర్నీ... ముస్తాక్ అలీ (నవంబరు 9 నుంచి) ట్రోఫీలో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నారు. ఆ తర్వాత దీనికి తుది అనుమతి రానుంది.
పవర్ ప్లేయర్‌కు నిరాశ...
వచ్చే ఐపీఎల్ నుంచి 'పవర్ ప్లేయర్' అనే కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టాలని భావించింది భారత క్రికెట్ బోర్డు. కానీ ఈ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఈ విధానాన్ని ఐపీఎల్ కంటే ముందు ముస్తాక్ అలీ టోర్నీలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సమయం లేదనే కారణంతో దీనికి ఆమోదం లభించలేదు.
ఏంటీ పద్ధతి..?
జట్లు మ్యాచ్‌లో ఏ దశలోనైనా (వికెట్ పడ్డాక లేదా ఓవర్ పూర్తయ్యాక) పవర్ ప్లేయర్‌గా పిలిచే సబ్‌స్టిట్యూట్‌ను బరిలోకి దించే ప్రక్రియే ఇది. ఈ ప్రతిపాదన ప్రకారం ఐపీఎల్లో జట్టు తుది ఎలెవన్ బదులుగా 15 మందితో కూడిన జట్టును ప్రకటిస్తుంది. వికెట్ పడ్డప్పుడు లేదా ఓవర్ ముగిశాక ఆటగాణ్ని సబ్‌స్టిట్యూట్‌గా దించవచ్చు.