మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఓడిపోయింది. నామమాత్ర మ్యాచ్‌లోనూ ఓటమి పాలై, సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది. అనంతరం మాట్లాడిన టీమిండియా సారథి కోహ్లీ.. జట్టులో ఫీల్డింగ్ ఏమాత్రం బాగాలేదని తెలిపాడు.
"మూడు వన్డేల్లోనూ ఫీల్డింగ్‌లో తప్పులు చేశాం. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ ఫీల్డింగ్ సరికాదు. టీ20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్ బాగా పుంజుకుంది. ఈ సిరీస్ విజయానికి వారు అర్హులు."
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
కివీస్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయగా.. వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ వైట్‌వాష్ చేసింది. త్వరలో టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ ఈ నెల 21న వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. దీనిపైనా స్పందించాడు కోహ్లీ.
"టెస్టు ఛాంపియన్ షిప్ వల్ల ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. టెస్టుల్లో జట్టు సమతూకంగా ఉంది. టెస్టు సిరీస్‌లో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సానుకూల దృక్పథంలో బరిలోకి దిగడం ముఖ్యం."
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
ఆఖరి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ (112) సెంచరీతో సత్తాచాటగా.. శ్రేయస్ అయ్యర్ (62) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన కివీస్ 47.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నికోల్స్ (80), గప్తిల్ (66), గ్రాండ్‌హోమ్ (58) అర్ధశతకాలతో మెరిశారు.