ఐపీఎల్ 14వ సీజన్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్‌ను ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే, ఈ విషయంపై స్పందించిన సారా తెందుల్కర్ తన సోదరుడిని అభినందించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అర్జున్ బౌలింగ్ చేస్తున్న ఫొటోను పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది.
'నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఇది నీది. క్రికెట్ అనేది తన రక్తంలోనే ఉంది. ఇన్నాళ్లూ నెట్స్‌లో సాధన చేసి మేటి క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు' అని సారా పేర్కొంది.
అర్జున్ సహజంగా లెఫ్టార్మ్ పేసర్, బ్యాట్స్‌మన్ అయినందున అతన్ని జట్టులోకి తీసుకున్నామని ఆ ఫ్రాంఛైజీ యజమాని ఆకాశ్ అంబానీ ఓ వీడియోలో పేర్కొన్నారు. అర్జున్ ఇటీవల ముంబయి సీనియర్స్ జట్టు తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడారు.

'నైపుణ్యాలున్నాయి కాబట్టే..'
సచిన్ తనయుడు అర్జున్ తెందుల్కర్‌ను అందరూ ఊహించినట్లే ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకోవడంపై శ్రీలంక మాజీ క్రికెటర్, ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్ధనే స్పందించాడు. ఆటగాడిగా ఎదగడానికి ముంజయి జట్టు అతనికి ఉపయోగపడుతుందన్నాడు. అర్జున్ నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకునే ముంబయి జట్టులోకి చేర్చుకుందని తెలిపాడు. రానున్న రోజుల్లో లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్‌గా అర్జున్ మంచి ఆటతీరు కనబరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టే ముంబయి జట్టు అర్జున్ను సొంతం చేసుకుంది. దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ కొడుకు కాబట్టి అందరి దృష్టి అతనిపై ఉంటుంది. కానీ, అదృష్టం కొద్దీ అర్జున్ బౌలర్ అయ్యాడు. ఒకవేళ అర్జున్ మంచి నైపుణ్యం కనబరిస్తే సచిన్ చాలా గర్వంగా భావిస్తాడు."
-జయవర్ధనే, ముంబయి జట్టు కోచ్.
గురువారం జరిగిన ఐపీఎల్ వేలంలో అర్జున్ తెందుల్కర్‌ను ముంబయి ఇండియన్స్ జట్టు రూ.20 లక్షల కనీసధరకు సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి:2021 ఐపీఎల్ స్పాన్సర్షిప్ మళ్లీ వివో చేతుల్లోకే!