మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత వికెట్ కీపింగ్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లలో రిషభ్ పంత్, సంజూ శాంసన్ ముందు వరుసలో ఉన్నారు. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ప్రస్తుతం ధోనీ జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో పంత్, శాంసన్ తమను తాము నిరూపించుకోవాలని, బహుశా మహీ కూడా ఇదే అనుకుంటున్నాడేమో అని అభిప్రాయపడ్డాడు.
"రిషభ్ పంత్, సంజూ శాంసన్ ప్రదర్శనను ధోనీ సహనంగా గమనిస్తున్నాడని నేననుకుంటున్నా. మహీ జట్టులోకి ఎప్పుడొచ్చినా ఐపీఎల్ తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడనుకుంటున్నా. ఇద్దరు ఆటగాళ్లు(పంత్, శాంసన్) తమకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోతే.. మహీ పునరాగమనం చేసి టీ20 ప్రపంచకప్ వరకు జట్టును ముందుండి నడిపిస్తాడు. మహీ ఆలోచన కూడా ఇదే కాబోలు. ఫామ్ తెచ్చుకునేందుకు అతడికి ఐపీఎల్ చక్కటి వేదిక." - వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా మాజీ క్రికెటర్.
ఇరువురు ఆటగాళ్లల్లో మొదటి అవకాశం రిషభ్ పంత్‌కే వస్తుందని, అతడి ప్రత్యామ్నాయంగా సంజూ శాంసన్‌ను పరిశీలించాలని లక్ష్మణ్ అన్నాడు.
ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న ధోనీ రిటైర్మెంట్పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 2020 జనవరి వరకు ఈ అంశంపై ప్రశ్నించవద్దని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. చివరగా మహీ వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు.
ఇదీ చదవండి: 'హోబర్ట్'తో సానియా మీర్జా రెండో ఇన్నింగ్స్...!