ఐపీఎల్ కోసం అందరి కంటే ఎక్కువ రోజులు క్వారంటైన్లో ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు. జట్టులో ఇద్దరు కరోనా బారిన పడటం ఫ్రాంచైజీకి ఆందోళన కలిగించింది. ఎంతో అనుభవం ఉన్న సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల సీజన్‌కు దూరమయ్యారు. ఇన్ని అడ్డంకుల్ని అధిగమించి సెప్టెంబర్ 19న డిఫెండింగ్ ఛాంపియన్ మంబయి ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమైంది సీఎస్కే. అయితే ఇందుకు కారణం ధోనియే అని తెలిసింది.
'మరో 14 రోజుల్లో..' అంటూ కోహ్లీ, దినేశ్ కార్తీక్ చిత్రాన్ని ఐపీఎల్ ట్విట్టర్లో ఉంచినప్పుడు అందరికీ ఒకే అనుమానం కలిగింది. ఆరంభ మ్యాచులో కోల్‌కతా, బెంగళూరు తలపడతాయని అనుకున్నారు. ఎంఎస్ ధోనీ తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్లే మొదటి మ్యాచులో చెన్నై ఆడుతోందట. వాస్తవంగా సెప్టెంబర్ 19 లేదా 23న తొలి మ్యాచ్ ఆడేందుకు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ సీఎస్‌కే అవకాశం కల్పించారని తెలిసింది. ఐదు రోజులు వెసులుబాటు దొరికితే సాధన చేసేందుకు సమయం దొరుకుతుందని అలా చేశారు.
ఎంఎస్ ధోనీ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదని సమాచారం. కెరీర్‌లో ఎన్నోసార్లు సాహసాలు చేసిన అతడు మరోసారి కఠిన నిర్ణయానికే మొగ్గుచూపాడట. సమయం సరిపోకున్నా సెప్టెంబర్ 19నే తొలి మ్యాచులో తలపడతామని చెప్పాడట. ఇలా చేయడం వల్ల మొదటి ఆరు రోజుల్లోనే సీఎస్‌కే మూడు మ్యాచులు ఆడాల్సి వస్తుంది. విశ్రాంతి తీసుకొనే సమయమూ దొరకదు. అయినా రిస్క్ చేసేందుకే మహీ పట్టుదలగా ఉన్నాడని తెలిసింది. ఆటగాళ్లూ విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారని ఐపీఎల్ వర్గాలు అనుకుంటున్నాయి.
అబుదాబి వేదికగా సెప్టెంబర్ 19న ముంబయి ఇండియన్స్, షార్జా వేదికగా 22న రాజస్థాన్ రాయల్స్, దుబాయ్ వేదికగా 25న దిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది.