వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఆగస్టు 22న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. అయితే వరుస సిరీస్ ఓటములతో నిరాశలో ఉన్న విండీస్ జట్టు కోసం ప్రముఖ బ్యాట్స్మెన్లు లారా, రామ్ నరేశ్ శర్వాణ్ రంగంలోకి దిగనున్నారు.
వెస్టిండీస్ లెజెండ్ లారా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశం తరఫున ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ (400*) సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పేరు గాంచిన కరీబియన్ క్రికెటర్లలో శర్వాణ్ ఒకడు. వీరిద్దరూ టెస్టు సిరీస్ ప్రారంభమవడానికి ముందు ఆటగాళ్లకు వారి విలువైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
"మా జట్టులో ప్రతిభ గల యువ ఆటగాళ్లు ఉన్నారు. భవిష్యత్తుకు వీరే భరోసా. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విజయం సాధించాం. యువ ఆటగాళ్లు మరింతగా రాణించాలని అనుకుంటున్నాం. అందుకోసం లారా, శర్వాణ్‌ను సంప్రదించాం. వారి సలహాలు, సూచనలు ఆటగాళ్లకు మరింత లాభం చేకూరుస్తాయి".
-జిమ్మీ ఆడమ్స్, క్రికెట్ విండీస్ డైరెక్టర్
వెస్టిండీస్-భారత్ మధ్య మొదటి టెస్టు ఆగస్టు 22న ప్రారంభంకానుంది. ఆంటిగ్వా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌తో టెస్టు ఛాంపియన్ షిప్‌ను ప్రారంభించనున్నాయి ఇరుజట్లు.
ఇవీ చూడండి.. శతకాల వేటలో రోహిత్-కోహ్లీ ద్వయం