ఆ ఐపీఎల్ సీజన్‌ను ఇప్పటికీ మర్చిపోలేనని అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆ సమయంలో తినే తిండిపైనా అసలు శ్రద్ధ వహించేవాడిని కాదని చెబుతూ, ఆ తర్వాత ఫిట్నెస్ సాధించేందుకు ఏమేం చేశాడో చెప్పాడు. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాల్ని పంచుకున్నాడు.
"2012 ఐపీఎల్ సీజన్ నా కెరీర్లోనే చెడ్డది. ఆ సమయంలో నా ఆహార అలవాట్లు దారుణంగా ఉండేవి. ఇంటికి వెళ్లినప్పుడు, అద్దంలో నన్ను నేను చూసి అసహ్యించుకున్నాను. అసలు నువ్వు అంతర్జాతీయ క్రికెటర్లా లేవు? నీ గురించి నువ్వే శ్రద్ధ తీసుకోకపోతే ఎలా? అంటూ ప్రశ్నించుకున్నాను. అప్పటి నుంచి నా డైట్ మార్చాను. రోజుకు రెండుసార్లు జిమ్‌లో కసరత్తులు చేశాను. ఫలితంగా 8-10 నెలల్లో ఆరేడు కిలోల బరువు తగ్గాను. నేను ఎంచుకోవాల్సిన దారి ఇదేనని అప్పుడు అర్థమైంది". -విరాట్ కోహ్లీ, టీమిండియా క్రికెటర్
ఫిట్నెస్, తన జీవితంలో ఎలా భాగమైంది, ప్రపంచకప్‌లో అది ఏ విధంగా ఉపయోగపడిందో చెప్పాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ.
"ప్రపంచకప్‌లో జరిగిన ప్రతీ మ్యాచ్‌లో నా ఎనర్జీ లెవల్స్ 120 శాతానికి మించే ఉన్నాయి. ఒక్కే గేమ్‌లో దాదాపు 15 కిలోమీటర్లకు పైగా పరిగెత్తేవాడిని. అనంతరం ఇంకో మ్యాచ్ కోసం మరొక నగరానికి వెళ్లేవాడిని. జిమ్‌లో అంతలా చెమటోడ్చాను కాబట్టే తక్కువ వ్యవధి(35 రోజులు)లో 10 గేమ్స్ ఆడగలిగాను". -విరాట్ కోహ్లీ, టీమిండియా క్రికెటర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తన ఆరాధ్య క్రికెటర్ అని చెప్పిన విరాట్... తను అత్యుత్తమ క్రీడాకారుడిగా ఎలా మారానో వెల్లడించాడు.
"జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు నేను అంత నైపుణ్యమున్న క్రీడాకారుడిని కాదని తెలుసు. అయినా ఓ స్థిరమైన విషయం నాపై పనిచేసింది. భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలంటే, ఒక నిర్దిష్ట పద్ధతిలో ముందుకు సాగాలని అర్ధమైంది. 2012లో ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగొచ్చినపుడు మా రెండు జట్లకు మధ్య తేడా గమనించాను. మేం ఆడుతున్న, శిక్షణ, ఆహార అలవాట్లు మార్చుకోకపోతే అత్యుత్తమంగా పోటీ పడలేమని గుర్తించాను. అప్పటి నుంచి శ్రమించాను. అనంతరం ఆట పట్ల నా ఆలోచన విధానమే మారిపోయింది." -విరాట్ కోహ్లీ, టీమిండియా క్రికెటర్
టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ సారథ్యం వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఆదివారం జరిగిన తొలి టీట్వంటీ వర్షం కారణంగా రద్దయింది. బుధవారం రెండో టీట్వంటీ జరగనుంది.
ఇది చదవండి: అనితర సాధ్యుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ