ఐపీఎల్‌లో ఆడినంత కాలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తానని టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కోహ్లీ మాట్లాడాడు. ఇద్దరూ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.
"ఆర్‌సీబీతో ప్రయాణం ఓ అద్భుతం. కప్‌ను సాధించడం మా కల. అయితే సీజన్‌లో మెరుగ్గా రాణించలేకపోయామనే బాధ ఉండొచ్చు. కానీ బెంగళూరు నుంచి వెళ్లిపోయే ఆలోచన అస్సలు లేదు. ఈ జట్టును ఎప్పటికీ వదిలివెళ్లను. అభిమానులు, వారి విధేయత ఎంతో గొప్పగా ఉంటుంది."
-విరాట్ కోహ్లీ, టీమ్‌ఇండియా సారథి
తొమ్మిదేళ్లుగా జట్టులో ఉంటున్న డివిలియర్స్ కూడా ఆర్‌సీబీని వీడనని తెలిపాడు. "నేను కూడా అంతే. ఆర్‌సీబీని ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్లను. పరుగులు సాధిస్తూనే ఉంటాను" అని మిస్టర్ 360 అన్నాడు.
దక్షిణాఫ్రికా మాజీలు గ్యారీ కిర్‌స్టన్, ఫ్లెచర్, మార్క్ బౌచర్ తనకు సహాయం చేశారని కోహ్లీ తెలిపాడు. "గ్యారీ ఎప్పుడూ సానుకూలంగా స్పందిచేవారు. బౌచర్ షార్ట్ బంతులను ఎదుర్కోవాలని 2008లో సూచించాడు. అతడికి గొప్ప విజన్ ఉంది. ఫ్లెచర్‌కు ఆటపై ఎంతో అవగాహన ఉంది. ఎంతో మంది ఆటగాళ్లు నా ఆటను మెరుగుపర్చుకోవడంలో సహాయపడ్డారు" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
కోహ్లీ, డివిలియర్స్ కలిసి భారత్-దక్షిణాఫ్రికా సంయుక్త అత్యుత్తమ జట్టును ఎంపిక చేశారు. సారథిగా ధోనీని ఎంపిక చేశారు.
జట్టు: సచిన్ తెందూల్కర్, రోహిత్ శర్మ, విరాట్, కోహ్లీ, ఏబీ డివిలియర్స్, జాక్వస్ కలిస్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), యువరాజ్ సింగ్, యుజువేంద్ర చాహల్, డేల్ స్టెయిర్, జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబాడ