కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లోని సెయింట్ లూసియా జాక్స్ ఫ్రాంఛైజీని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకునేందుకు, తమ సహ యజమాని మోహిత్ బర్మన్ అక్కడికి వెళ్లినట్లు ఆ ఫ్రాంఛైజీ యాజమాని నెవాడియా చెప్పాడు.
"సీపీఎల్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు ఒప్పందం చేసుకోబోతున్నాం. సెయింట్ లూసియా జట్టును దక్కించుకోనున్నాం. బీసీసీఐ అనుమతులొచ్చాకే ఇతర విషయాలను వెల్లడిస్తాం"
-నెవాడియా, పంజాబ్ జట్టు సహ యజమాని
సెయింట్ లూసియా ప్రధాని అలెన్ చస్టానెట్, పర్యాటక శాఖ మంత్రి డొమినిక్ ఫిడ్డేకు అతడు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. ఇంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం, 2015లోనే ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు సీపీఎల్‌లో రెండో ఫ్రాంఛైజీగా పంజాబ్ యాజామాన్యం అడుగుపెట్టనుంది.
2013లో ప్రారంభమైన కరీబియన్ ప్రీమియర్ లీగ్.. ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో ఆరు జట్లు ఉండగా, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఒక్కటే.. అత్యధికంగా మూడుసార్లు టైటిల్ సాధించింది. మరోవైపు విండీస్ మాజీ సారథి డారెన్ సామి నేతృత్వంలోని సెయింట్ లూసియా.. 2016లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ లీగ్‌లో సెయింట్ లూసియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
"కింగ్స్ ఎలెవన్ యాజమాన్యం సీపీఎల్‌లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. అందుకోసమే మేం ఎదురుచూస్తున్నాం. అలాగే కొత్త యాజమాన్యం నేతృత్వంలోని సెయింట్ లూసియా మంచి విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నా. ఈ టోర్నీ ఎనిమిదో సీజన్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 26 వరకు జరగనుంది"
-పీట్ రసెల్, సీపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్.
ఇదీ చూడండి.. 'ప్రపంచకప్ విజేతగా నిలవడమే లక్ష్యం'