బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న గంగూలీకి శుభాకాంక్షలు తెలిపాడు టీమిండియా మాజీ ఆటగాడు గంభీర్. అధ్యక్షుడిగా గంగూలీకి 10 నెలల కన్నా ఎక్కువ సమయం ఇస్తేనే బాగుంటుందని సూచించాడు.
"ఇదెలా జరిగిందో తెలీదు. తెలుసుకోవాలని కోరుకోవడం లేదు. వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి భారత క్రికెట్‌కు అధినేత కావడం సంతోషకరం. తన ముద్ర వేసేందుకు దాదాకు 10 నెలల కన్నా ఎక్కువ పదవీకాలం లభించాలని కోరుకుంటున్నా. లేదంటే మొత్తం కసరత్తు వృథానే. బోర్డులో అనేక మార్పులు తీసుకొస్తారనేందుకు బెంగాల్ క్రికెట్ సంఘంలో తీసుకొచ్చిన మార్పులే సూచన. ఇప్పుడు పాలకుడిగా ఆయన నైపుణ్యాలకు పరీక్ష ఎదురుకానుంది."
-గంభీర్, టీమిండియా మాజీ ఆటగాడు
గంగూలీకి అందరి నుంచి మద్దతు లభించాలని కోరాడు గంభీర్.
"ప్రస్తుతం అభినందనలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరూ గంగూలీకి మద్దతు ఇస్తారని భావిస్తున్నా. బీసీసీఐ బోర్డు రూం, డ్రెస్సింగ్ రూం నుంచి సహకారం లభిస్తేనే ఫలితాలు రాబట్టడం సాధ్యమవుతుంది. అప్పట్లో జగ్మోహన్ దాల్మియా ప్రోత్సాహం లేకుంటే గంగూలీకి ఎన్నో సవాళ్లు ఎదురయ్యేవి. దాదా, కోచ్ జాన్‌రైట్ కలిసే యువకులైన సెహ్వాగ్, నెహ్రా, యువరాజ్, హర్భజన్, జహీర్‌ను పెంచి పెద్దచేశారు. ద్రవిడ్, కుంబ్లే, సచిన్, లక్ష్మణ్ మద్దతూ గంగూలీకి ఉండేది. ఇబ్బందులు ఎక్కడ ఎదురవుతాయో తెలిసిన బీసీసీఐ పెద్దల ప్రోత్సాహం ఇప్పుడు దాదాకు అవసరం. ఇక నుంచి భారత క్రికెట్‌ను ప్రపంచం మరింత ఆసక్తితో చూస్తుంది. నన్ను నమ్మండి".
-గంభీర్, టీమిండియా మాజీ ఆటగాడు
అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ మాజీ ఆటగాడిని ఇంత పెద్ద పదవి వరించనుండటం పట్ల మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి.. 'ఆ సమయంలో గంగూలీ ఉంటే బాగుండేది'