కరోనా ప్రభావంతో నిరవధిక వాయిదా పడ్డ ఐపీఎల్.. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తున్నట్లు గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ గతవారం చెప్పారు. అయితే ఫైనల్‌పై కొత్త ట్విస్టు తెరపైకి వచ్చింది. రెండు రోజుల ఆలస్యంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం. త్వరలో జరిగే పాలకమండలి సమావేశంలో దీని గురించి చర్చించనున్నారు.
![IPL TROPHY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5411065-23-5411065-1576650702202_3007newsroom_1596093677_789.jpg)
అయితే, ఫైనల్‌ను వాయిదా వేయడానికి తగిన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ రెండు వారాలు క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొనడం వల్ల ఆటగాళ్లు ముందుగానే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్‌ను రెండు రోజులు వాయిదా వేస్తే తర్వాత భారత జట్టును స్వదేశానికి తీసుకురాకుండా నేరుగా ఆస్ట్రేలియాకు తరలించడం సురక్షితమని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా ఇలా జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఆ ఫైనల్ కన్నా ముందే పలువురు ఆటగాళ్లు తమ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నా అక్కడే ఉంటారని, టోర్నీ మొత్తం పూర్తయ్యాకే జట్టంతా కలిసి ఆస్ట్రేలియాకు పయనమవుతుందని ఓ అధికారి వెల్లడించారు.